...
...
Next Story

కార్తీక మాసం స్పెషల్.. పంచారామాలు, త్రిశైవ క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు

కార్తీక మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ(APSRTC) పంచారామ క్షేత్రాలు, శబరిమల, శ్రీశైలం, త్రిశైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు, టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. వివిధ డిపోల వారీగా బస్సుల వివరాలు, ఛార్జీలు, ఆన్‌లైన్ బుకింగ్ సమాచారం ఇక్కడ తెలుసుకోండి.

Updated on: Nov 15, 2026, 15:50:14 IST
Advertisement

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలను దర్శించుకునే భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు, టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. తక్కువ ఖర్చుతో, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణంతో పుణ్యక్షేత్రాలను దర్శించుకునేలా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

పంచారామ క్షేత్రాలకు

శ్రీశైలం
శ్రీశైలం

కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన పంచారామ క్షేత్రాలైన అమరావతి (అమరారామం), భీమవరం (సోమారామం), పాలకొల్లు (క్షీరారామం), ద్రాక్షారామం (భీమేశ్వర స్వామి), సామర్లకోట (కుమారభీమేశ్వర స్వామి) ఆలయాలను దర్శించుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు.

ఏలూరు జిల్లా (ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం డిపోలు) నుంచి నవంబర్ 15, 22, 29 తేదీలతో పాటు డిసెంబర్ 6వ తేదీ రాత్రి 8 గంటలకు ఈ డిపోల నుండి బస్సులు బయలుదేరుతాయి. అల్ట్రా డీలక్స్ బస్సులో రూ. 1,100, సూపర్ లగ్జరీ బస్సులో రూ. 1,200 టికెట్ ధరగా నిర్ణయించారు.

తూర్పుగోదావరి జిల్లా (రాజమహేంద్రవరం, ఏలేశ్వరం డిపోలు) నుంచి ఎక్స్‌ప్రెస్ బస్సులో రూ. 900, అల్ట్రా డీలక్స్ రూ. 1,100, సూపర్ లగ్జరీ బస్సులో రూ. 1,150 ఛార్జీతో ఒకే రోజు యాత్ర ప్యాకేజీని అందిస్తున్నారు.

విజయవాడ (పండిట్ నెహ్రూ బస్ స్టేషన్) నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నారు.

గుంటూరు జిల్లా (గుంటూరు-1, మంగళగిరి, తెనాలి, పొన్నూరు డిపోలు) నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9:30, 9:35 గంటలకు బస్సులు బయలుదేరుతాయి.

శబరిమల ప్రత్యేక ప్యాకేజీలు

రాజమహేంద్రవరం (తూర్పుగోదావరి) నుండి 5 రోజుల యాత్రకు రూ. 5,000, 7 రోజుల యాత్రకు రూ. 6,000, 10 రోజుల యాత్రకు రూ. 7,500 ఛార్జీలుగా నిర్ణయించారు. శబరిమల యాత్రకు బస్సు బుక్ చేసుకునే ప్రతి గురుస్వామికి ఉచిత ప్రయాణ సదుపాయంతో పాటు ఇద్దరు మణికంఠులు, ఇద్దరు వంటవారికి ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు.

త్రిశైవ క్షేత్రాలకు

ఏలూరు నుండి శ్రీశైలం ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. గుంటూరు నుండి త్రిశైవ క్షేత్రాలు (శ్రీశైలం, యాగంటి, మహానంది) ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. గుంటూరు నుండి రూ. 1,440 (సూపర్ లగ్జరీ), రూ. 1,380 (అల్ట్రా డీలక్స్), తెనాలి నుండి రూ. 1,540, అల్ట్రా డీలక్స్ రూ.1,480, మంగళగిరి నుండి రూ. 1,450, అల్ట్రా డీలక్స్ రూ. 1,510, పొన్నూరు నుండి రూ. 1,510, అల్ట్రా డీలక్స్ రూ. 1,450గా నిర్ణయించారు.

భక్తులు ముందస్తు రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ www.apsrtconline.in ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఆయా డిపోల అధికారులను సంప్రదించవచ్చు:

ఏలూరు డిపో: 94410 10271, 99592 25487, జంగారెడ్డిగూడెం డిపో: 99592 25489, 94929 49350, 99592 25789, నూజివీడు డిపో: 99592 25461, మార్కెటింగ్ సెల్: 94416 41115, రాజమహేంద్రవరం / తూర్పుగోదావరి డిపోలు: 95023 00189, 83176 02975, 0883-2468625, 99592 25561 నెంబర్లను సంప్రదించవచ్చు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks