ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
కార్తీక పౌర్ణమి 2026 : ఏపీ, తెలంగాణలో ఓం నమః శివాయ నామస్మరణతో మార్మోగుతున్న శివాలయాలు
Karthika Pournami : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేములవాడ, శ్రీశైలం సహా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేస్తున్నారు భక్తులు.
తెలుగు రాష్ట్రాల్లో ఎటుచూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు, నదీ తీరాలు భక్తజన సంద్రంగా మారాయి. వేకువజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి, కార్తీక దీపాలను వెలిగిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు.

పౌర్ణమి గడియలు కావడంతో తెల్లవారుజాము 4 గంటల నుంచే గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీ తీరాలకు భక్తులు పోటెత్తారు. తెలంగాణలో భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం, మంథని వద్ద గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో దీపాలను వదిలారు.
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడలోని కృష్ణా నది ఘాట్లతో పాటు రాజమండ్రిలోని పుష్కర ఘాట్, కోటిలింగాల రేవు వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమో నారాయణాయ అనే నామస్మరణలతో ఆలయాలు మార్మోగుతున్నాయి.
ఈ విశిష్ట దినాన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో అర్చకులు ప్రత్యేక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, కీసరగుట్ట, వరంగల్ వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయాల్లో భక్తులు బారులు తీరారు. వేములవాడలో భక్తులు కోడె మొక్కులు చెల్లించుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి సన్నిధికి భక్తులు భారీగా తరలివచ్చారు. అలాగే పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాల్లో స్వామివారికి విశేష పూజలు జరుగుతున్నాయి.
సాయంత్రం వేళ అన్ని ప్రముఖ ఆలయాల్లో అత్యంత వైభవంగా జ్వాలా తోరణం కార్యక్రమాన్ని ఉంటుంది. ఇందుకోసం ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ జ్వాలా తోరణం కింద నుంచి నడిస్తే సకల పాపాలు తొలగి, గ్రహ దోషాలు నివారణ అవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయాలకు వెళ్లలేని వారు తమ ఇళ్ల వద్దే వేకువజామున తలస్నానం చేసి, తులసి కోట ముందు ముగ్గులు వేసి ఆవు నెయ్యి, నువ్వుల నూనెతో 365 వత్తుల దీపాలను వెలిగించారు.
కార్తీక పౌర్ణమి రద్దీ దృష్ట్యా దేవాదాయ, పోలీసు శాఖలు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాయి. నదీ తీరాల వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచడంతోపాటు ఆలయాల వద్ద ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, వైద్య శిబిరాలను అందుబాటులోకి తెచ్చారు. సాయంత్రం దీపారాధన సమయానికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

E-Paper
