...
...
Next Story

శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఈనెల 29న తిరుమలలో కార్తీక వనభోజనం, పలు సేవలు రద్దు

నవంబరు 29న తిరుమలలోని పార్వేట మండపంలో కార్తీక వనభోజనం జరుగుతుంది. ఉదయం 8.30 గంటలకు స్వామివారి ఊరేగింపు మొదలై, మధ్యాహ్నం 1 గంటకు వనభోజనం నిర్వహిస్తారు. ఈ కారణంగా ఆ రోజు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

Published on: Nov 26, 2026, 14:17:11 IST
Advertisement

పవిత్ర కార్తీకమాసం సందర్భంగా తిరుమలలోని గోగర్భం సమీపంలో ఉన్న పార్వేట మండపంలో నవంబరు 29వ తేదీన కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది. కార్తీకమాసంలో వనభోజనాలు నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఈ ఆధ్యాత్మిక వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతారు.

ఉదయం చిన్న గజవాహనంపై ఊరేగింపు…

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

ఈ ఉత్సవంలో భాగంగా నవంబరు 29న ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై ఆలయం నుంచి బయలుదేరుతారు. శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకిపై కొలువై ఉంటారు. ఊరేగింపుగా వీరంతా పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు.

అనంతరం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ వేడుకలో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు వంటి సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

పలు సేవలు రద్దు చేసిన టీటీడీ

కార్తీక వనభోజనం నేపథ్యంలో ఆ రోజు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు సేవలను టీటీడీ రద్దు చేసింది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను నిలిపివేసింది. భక్తులు ఈ మార్పును గమనించి తమ దర్శన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.

ఇక పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో నవంబరు 30వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలోని పరేడ్ మైదానంలో కార్తీక మహాదీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.45 గంటల వరకు భక్తిప్రపత్తులు వెల్లివిరిసేలా విశేష పూజలు, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఈ మహాదీపోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా వందలాది మంది మహిళలు సామూహికంగా దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి లక్ష్మీ నీరాజనం సమర్పించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి దివ్య అనుగ్రహంతో సమస్త ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని లోకక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks