TG Cheyutha Pension Amount : మీకు కొత్తగా పెన్షన్ మంజూరు అయిందా..? డబ్బుల జమపై తాజా అప్డేట్ ఇదిగో

తెలంగాణలో కొత్తగా 4.72 లక్షల పెన్షన్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సంబంధిత పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అయితే వీరి ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు సిద్ధం చేసింది.

Published on: Nov 25, 2026, 11:20:56 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలో కొత్త పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటికే లక్షలాది మందికి సంబంధిత పత్రాలను అందజేశారు. నియోజకవర్గాల్లోని మండలాలు, గ్రామ పంచాయతీ కేంద్రాల్లో వీటిని పంపిణీ చేస్తున్నారు. అయితే వీరంతా కూడా తమ ఖాతాల్లోకి డబ్బులు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పేందుకు సిద్ధమైంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న (గురువారం) లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా పింఛన్ నగదును జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణ కొత్త పెన్షన్లు
తెలంగాణ కొత్త పెన్షన్లు

4.72 లక్షల మందికి కొత్త పింఛన్లు….

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా 4.72 లక్షల మందికి కొత్త పించన్లను మంజూరు చేసింది. కొత్త పెన్షన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి…. 360 డిగ్రీల కోణంలో విచారణ చేపట్టారు. నిజమైన లబ్ధిదారులను ఏరికోరి, 4.72 లక్షల మంది అర్హులని తేల్చారు. వీరందరికీ ఇప్పటికే మంజూరు పత్రాలు కూడా అందజేశారు.

ఇక ఈ నెల నుంచి ప్రతి నెలా చేయూత పించన్లను అందించనున్నారు. చేయూత పథకం కింద ప్రభుత్వం రూ.2 వేల పించన్ ఇస్తోంది. సీఎం రేవంత్ బటన్ నొక్కి నిధులు విడుదల చేయగానే….. ఏకకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు పడేలా పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

గతంలో పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ల పంపిణీ జరిగేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ విధానాన్ని మార్చాలని నిర్ణయించింది. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా నగదు జమ చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులను ఆదేశించింది. బ్యాంకు ఖాతాలు, ఆధార్ లింకింగ్ వంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన మొత్తం 4,63,857 పింఛన్లలో వివిధ వర్గాల వారికి చోటు కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఈ జాబితాను ఖరారు చేశారు. విభాగాల వారీగా లబ్ధిదారుల సంఖ్య కింది విధంగా ఉంది…

  • వితంతువులు : 2,77,894 మంది
  • దివ్యాంగులు : 1,00,224 మంది
  • ఒంటరి మహిళలు : 53,844 మంది
  • గీత కార్మికులు : 27,444 మంది
  • చేనేత కార్మికులు : 4,451 మంది

స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

మొన్నటి వరకు తెలంగాణ చేయూత పెన్షన్ల అధికారిక పోర్టల్‌లో దరఖాస్తుదారుల స్టేటస్ పరిశీలిస్తే 'Applied For Pension' అని కనిపించేది. అయితే తాజాగా ఈ స్టేటస్‌లో మార్పులు గమనించవచ్చు. కొందరికి అప్రూవ్ అని వస్తే… ఆన్‌లైన్‌లో మరికొంత మందికి 'Withheld' అని చూపిస్తోంది. ఇలా కనిపిస్తే టెన్షన్ పడాల్సిన పని లేదు. వీరికి కూడా పెన్షన్ దాదాపుగా మంజూరు అయినట్లే. అయితే వీరి సదరు పంచాయతీ కార్యదర్శిని లేదా సంబంధిత అధికారులను కలిసి ఏమైనా పత్రాలు అవసరం ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక ఆన్లైన్ స్టేటస్ పేజీలో మీకు మంజూరైన పెన్షన్ మొత్తం వివరాలు కనిపించడంతో పాటు, కొత్తగా పెన్షన్ ఐడీ కూడా జనరేట్ అయి ఉంటుంది. ఈ ఐడీ నంబర్ మీ జిల్లా కోడ్‌తో మొదలవుతుంది. ఈ పెన్షన్ ఐడీతో కూడా మీ పెన్షన్ మంజూరు స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

దరఖాస్తుదారులు తమ స్టేటస్ తెలుసుకోవడానికి చేయూత అధికారిక వెబ్‌సైట్ https://www.cheyutha.telangana.gov.in/SSPTG/UserInterface/Portal/SSPdigitalsearchNew.aspx ను సందర్శించి వివరాలు నమోదు చేసి పరిశీలించుకోవచ్చు. ఆధార్ నెంబర్ లేదా పెన్షన్ ఐడీ, అప్లికేషన్ ఐడీని సమర్పించి… స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు.

ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమంలో మంజూరు పత్రాన్ని పొందే వీలు కుదరకపోతే….. గ్రామీణ ప్రాంతాల వారు ముందుగా తమ గ్రామ పంచాయతీ సెక్రటరీని కలవాలి. అక్కడ ధృవీకరణ ప్రక్రియ పూర్తి చేసి మీ పెన్షన్ మంజూరు పత్రాన్ని తీసుకోవచ్చు. దీనివల్ల వచ్చే నెల నుంచి క్రమం తప్పకుండా మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయి.

  • ఒకవేళ పెన్షన్ మంజూరులో ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉన్నా, పూర్తి వివరాల కోసమైనా మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ లోని సెర్ప్ (SERP) అధికారులను సంప్రదించవచ్చు.
  • పట్టణ ప్రాంతాల్లో నివసించే దరఖాస్తుదారులు తమ పరిధిలోని మున్సిపల్ కార్యాలయంలోని సంబంధిత అధికారులను కలవాలి.
  • అధికారులు తమ అధికారిక లాగిన్ నుంచి మీ కొత్త పెన్షన్ ఐడీని ఎంటర్ చేసి…. ఏ కారణాలతో పెన్షన్ తాత్కాలికంగా నిలిపివేశారో స్పష్టంగా తెలియజేస్తారు. తగిన పత్రాలు సమర్పిస్తే వెంటనే క్లియర్ చేస్తారు.

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.