LLR At Home : ఏపీలో ఇంటి వద్ద నుంచే లెర్నర్ లైసెన్స్ పరీక్ష.. ఎలా ఎల్ఎల్ఆర్ పొందాలి?

LRR At Home : ఆంధ్రప్రదేశ్‌లో లెర్నర్ లైసెన్స్ కోసం ఇక మీదట ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇంటి దగ్గర నుంచే ఎల్ఎల్ఆర్ పొందవచ్చు.

Updated on: Sep 28, 2026, 06:31:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వాహనదారులకు రవాణా శాఖ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఇకపై లెర్నర్స్ లైసెన్స్ (LLR) కోసం ఆర్టీవో కార్యాలయాల (RTO Offices) చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఇంటి వద్ద నుంచే ఆన్‌లైన్ పరీక్ష రాసి ఎల్‌ఎల్‌ఆర్‌ పొందే నూతన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆదివారం నుంచే ఈ విధానం అమల్లోకి వచ్చింది. రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ నూతన డిజిటల్ విధానంలో లెర్నర్స్ లైసెన్స్ పొందడానికి అనుసరించాల్సిన దశలు కొన్ని ఉన్నాయి.

ఇంట్లోనే లెర్నర్ లైసెన్స్ టెస్ట్
ఇంట్లోనే లెర్నర్ లైసెన్స్ టెస్ట్

ముందుగా అధికారిక సారథి వెబ్‌సైట్‌లోకి వెళ్లి, 'LLR Online STALL' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

రాష్ట్రం పేరును ఎంపిక చేసి, ఆధార్ వివరాలను ఎంటర్ చేయాలి. ఆపై ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లిస్తే అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది.

కెమెరా వెబ్‌క్యామ్ సదుపాయం ఉన్న ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ కంప్యూటర్‌లో అప్లికేషన్‌ తెరిచి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన పిన్ (PIN) నమోదు చేయాలి.

ఆన్‌లైన్ స్క్రీన్‌పై మొత్తం 20 ప్రశ్నలు వస్తాయి. అందులో కనీసం 12 ప్రశ్నలకు (60 శాతం మార్కులు) సరైన సమాధానాలు ఇస్తే పరీక్ష ఉత్తీర్ణులైనట్లు పరిగణిస్తారు.

పరీక్ష పాస్ కాగానే వెబ్‌సైట్ నుంచి నేరుగా లెర్నర్స్ లైసెన్స్ డిజిటల్ కాపీ డౌన్‌లోడ్ అవుతుంది.

దేశంలోని 26 రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉన్నప్పటికీ, అక్కడ ఆధార్ ఇ-కేవైసీ ద్వారా వేరొకరు పరీక్ష రాసేందుకు అవకాశాలు ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎటువంటి మోసాలకు తావులేకుండా కృత్రిమ మేధ నిఘాలో పకడ్బందీ వ్యవస్థను రూపకల్పన చేశారు.

అభ్యర్థి కంప్యూటర్ కెమెరాను ఏఐ సిస్టమ్ నిశితంగా పరిశీలిస్తుంది. పరీక్ష రాసే సమయంలో తల పక్కకు తిప్పినా, లేదా పక్క నుంచి ఎవరైనా మాట్లాడినట్లు శబ్దం వచ్చినా సిస్టమ్ ఆటోమేటిక్‌గా అభ్యర్థిని ఫెయిల్ చేస్తుంది. ఒకే సిస్టమ్ లేదా ఐపీ అడ్రస్ నుంచి రోజుకు గరిష్టంగా ఇద్దరు మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతి ఉంటుంది.

ఆధార్ ఆథెంటికేషన్‌తో ముఖాన్ని పోల్చి చూసేందుకు 5 సార్లు అవకాశం ఇస్తారు. మ్యాచ్ కాకపోతే అభ్యర్థి నేరుగా ఆర్టీఓ ఆఫీస్‌కే వెళ్లాల్సి వస్తుంది.

సొంతంగా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ లేని వారు సమీపంలోని స్వర్ణ గ్రామీణ లేదా వార్డు సచివాలయాలకు వెళ్లి అక్కడ అప్లై చేసుకుని, పరీక్ష రాసే వెసులుబాటు ఉంది. ఆధార్ కార్డు లేనివారు లేదా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తికాని వారు పాత పద్ధతిలోనే నేరుగా రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.

అసలు పరీక్ష ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి సారథి పోర్టల్‌లోనే ఉచితంగా ఎన్నిసార్లైనా మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయవచ్చు. రోజుకు వేలమంది ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ తప్పనుంది. ఆన్‌లైన్‌లో ఎల్‌ఎల్‌ఆర్ పొందిన వారు నెల రోజుల తర్వాత, 6 నెలల వ్యవధిలోపు ఆర్‌టీఓ ట్రాక్‌పై డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరై పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More