...
...
Next Story

ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026కు శాసనసభ ఆమోదం.. ఓటు హక్కు నమోదుపై కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు-2026కు శాసనసభ ఆమోదం తెలిపింది. మరోవైపు 18 ఏళ్లు నిండిన యువతకు ఏడాదికి నాలుగు సార్లు ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించనుంది ప్రభుత్వం.

Updated on: Feb 18, 2026, 22:18:06 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ సవరణ బిల్లు - 2026కు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తరపున పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులందరూ బిల్లును స్వాగతించారు.

ఏపీ అసెంబ్లీ
ఏపీ అసెంబ్లీ

బిల్లులోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే గతంలో పంచాయతీరాజ్ సంస్థల్లో ఓటు హక్కు పొందడానికి కేవలం జనవరి 1వ తేదీని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారు. దీనివల్ల జనవరి 2న 18 ఏళ్లు నిండిన యువత మరో ఏడాది వేచి చూడాల్సి వచ్చేది. తాజా సవరణ ప్రకారం, ఏడాదికి నాలుగు సార్లు (జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, మరియు అక్టోబర్ 1) ఓటు హక్కు నమోదుకు అవకాశం కల్పించారు.

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర చట్టం ఇప్పటికే ఈ నాలుగు తేదీల విధానాన్ని అమలు చేస్తోంది. మున్సిపాలిటీల్లో కూడా ఇదే విధానం ఉంది. ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థలను కూడా వీటికి అనుసంధానించడం ద్వారా రాష్ట్రంలో ఒకే విధమైన ఓటర్ల జాబితా విధానం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 23, 2025న ఈ అంశంపై ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనికి శాసనసభ చట్టబద్ధత కల్పించింది.

ఈ బిల్లుపై జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, ఎన్. ఈశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలను తొలగించి, పారదర్శకమైన జాబితాను రూపొందించాలని వారు సూచించారు. సభ్యుల సూచనలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe