Andhra Gas Leak : కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. వణికిపోతున్న ప్రజలు.. బైపాస్ రోడ్డు క్లోజ్

Andhra Gas Leak : కోనసీమ జిల్లాలో మరోసారి గ్యాస్ లీక్ కలకలం సృష్టించింది. ఓఎన్జీసీ రీ డ్రిల్లింగ్ పాయింట్ నుంచి గ్యాస్ ఒక్కసారిగా లీక్ కావడంతో చుట్టుపక్కల గ్రామల ప్రజలను ఖాళీ చేయించారు.

Published on: Nov 17, 2026, 10:26:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్ తీవ్ర కలకలం రేపింది. మామిడికుదురు మండలం గెద్దాడ నగరం సమీపంలోని తాడివారి మెరక వద్ద ఉన్న ఓఎన్‌జీసీ రీ-డ్రిల్లింగ్ పాయింట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ లీక్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

కోనసీమ గ్యాస్ లీక్
కోనసీమ గ్యాస్ లీక్

స్థానిక అధికారుల కథనం ప్రకారం.. గ్రామ పరిధిలోని మూసివేసిన పాత చమురు బావి వద్ద ప్రస్తుతం ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో రీ-డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున పనులు కొనసాగుతున్న సమయంలో, ఒక్కసారిగా భూమి లోపలి నుంచి భారీ శబ్దంతో కూడిన ఒత్తిడితో గ్యాస్ బయటకు తన్నుకొచ్చింది. గాలి వేగానికి ఈ వాయువు క్రమంగా సమీప గ్రామాల వైపు వ్యాపించడం మొదలైంది.

తెల్లవారుజామున నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా వినిపించిన భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డారు. గ్యాస్ వాసన వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఓఎన్‌జీసీ నిపుణులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలెవరూ నిప్పు వెలిగించవద్దని, గ్యాస్ స్టవ్‌లు వాడవద్దని అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. నరసాపురం నుంచి ప్రత్యేకంగా బ్లోఅవుట్ కంట్రోల్ టీమ్ గ్రామానికి చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు చేస్తోంది. లీకవుతున్న గ్యాస్‌కు నిప్పు అంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బందిని భారీగా మోహరించారు.

ఒకవేళ మంటలు చెలరేగినా అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించేందుకు, బావి చుట్టూ నిరంతరాయంగా నీటిని విరజిమ్మే వాటర్ అంబ్రెల్లా వ్యవస్థను ఏర్పాటు చేశారు.

గ్యాస్ లీకేజీ తీవ్రత దృష్ట్యా, ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా సమీపంలోని 216వ జాతీయ రహదారి (NH-216) బైపాస్ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, గ్యాస్ వ్యాప్తిని అరికట్టి లీకేజీని పూర్తిగా నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై ఓఎన్‌జీసీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గ్యాస్ లీకేజీని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ఓఎన్జీసీ అధికారులు చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్, ఎస్పీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా అధికారుల సూచలను పాటించాలని కోరారు.

కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ బావుల వద్ద గ్యాస్ లీక్ ఘటనలు పునరావృతం కావడం స్థానికులను కలవరపెడుతోంది. ఇదే జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జనవరి 5న కూడా ఇదే తరహాలో భారీ గ్యాస్ లీక్ సంభవించింది. అంతేకాకుండా గతంలో ఇదే గ్రామంలో గెయిల్ పైప్‌లైన్ పేలుడు ఘటన పెను విషాదాన్ని మిగిల్చిన నేపథ్యంలో, తాజా లీకేజీతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్‌జీసీ భద్రతా ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More