LPG price hike : స్వల్పంగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర- తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎంతంటే..
పండుగ సీజన్ ప్రారంభమవుతున్న వేళ దేశంలో గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వాణిజ్య విభాగానికి వాడే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 10 పెంచగా, విమాన ఇంధనం (ఏటీఎప్) ధరను కూడా లీటరుపై రూ. 1.37 చొప్పున సవరించాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ధన్తేరస్, దీపావళి పండుగల వేళ ప్రజలు ఎంతో సంతోషంతో వేడుకలకు సిద్ధమవుతున్న తరుణంలో చమురు కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి. నవంబర్ 1 ఆదివారం నుంచి వర్తించేలా వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరలను పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) నిర్ణయం తీసుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు, రూపాయి మారకం విలువ ఆధారంగా చమురు సంస్థలు ఈ నిర్ణయం ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనూ హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తరహా వ్యాపారులపై ఈ ధరల పెంపు ప్రభావం పడనుంది.
వరుసగా రెండో నెల పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధరలు..
దేశ రాజధాని 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ఈసారి రూ. 10 పెంచడంతో దాని కొత్త ధర రూ. 2,820 కి చేరుకుంది. వాణిజ్య సిలిండర్ ధర పెరగడం ఇది వరుసగా రెండో నెల కావడం గమనార్హం.
గతంలో అక్టోబర్ 1న ఏకంగా రూ. 62.50 పెంచగా, సెప్టెంబర్ 1న కూడా రూ. 9.50 చొప్పున ధర పెంచారు. అంతకుముందు జూలై, ఆగస్టు నెలల్లో సిలిండర్‌పై వరుసగా రూ. 183.50, రూ. 192 చొప్పున తగ్గినప్పటికీ.. ఆ తర్వాత పండుగల సీజన్‌లో ధరలు మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో హోటల్ నిర్వాహకులు, టిఫిన్ సెంటర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ పరిణామాల వల్ల ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఏకంగా రూ. 1,373 పెరిగి కమర్షియల్ సిలిండర్ ధర గరిష్టంగా రూ. 3,113.50 దాటిన సంగతి తెలిసిందే.
వివిధ ప్రాంతాల్లో 19కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు..
హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 69 పెరిగి రూ. 3,065కి చేరింది.
ఇక విజయవాడలో సైతం 19 కేజీల సిలిండర్ ధర రూ. 69 పెరిగి రూ. 3001.5
మరోవైపు చెన్నైలో రూ. 66.5 వృద్ధి చెందిన వాణిజ్య సిలిండర్ ధర రూ. 2983కి పెరిగింది.
ఇక బెంగళూరులో 19 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 2898కి చేరింది.
గృహ వినియోగదారులకు పెద్ద ఊరట!
సామాన్య గృహ వినియోగదారులకు మాత్రం ఈసారి ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఇంట్లో వంట కోసం వాడే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దిల్లీలో ప్రస్తుతం అమల్లో ఉన్న రూ. 942 ధర వద్దే ఇది కొనసాగనుంది.
హైదరాబాద్, విజయవాడలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరలు వరుసగా రూ. 994, రూ. 996.5గా ఉన్నాయి.
అలాగే ద్విచక్ర వాహనాలు, కార్లలో వాడే పెట్రోల్, డీజిల్ ధరలను కూడా చమురు కంపెనీలు యథాతథంగా ఉంచాయి. స్థానిక పన్నులు (వాట్) ఆధారంగా వివిధ రాష్ట్రాల్లో ఈ గ్యాస్, ఏటీఎఫ్ ధరల్లో స్వల్ప తేడాలు ఉండే అవకాశముంది.
విమాన ప్రయాణాలు మరింత ఖరీదు?
మరోవైపు విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎప్) ధరలను కూడా చమురు సంస్థలు పెంచాయి. ఏటీఎఫ్ ధర లీటరుకు రూ. 1.37 పెరగడంతో కొత్త ధర లీటరుకు రూ. 138.50కి చేరుకుంది.
విమాన ఇంధన ధరలు పెరగడం ఇది వరుసగా నాలుగో నెల!
- ఆగస్టు 1న లీటరుకు రూ. 5 పెరిగింది.
- సెప్టెంబర్ 1న లీటరుకు రూ. 6.28 పెంచారు.
- అక్టోబర్ 1న ఏకంగా లీటరుకు రూ. 16 భారీగా పెంచారు.
విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో కేవలం విమాన ఇంధనానికే దాదాపు 40 శాతం వరకు ఖర్చవుతుంది. పండుగల సీజన్‌లో వరుసగా నాలుగు నెలల పాటు ఏటీఎఫ్ ధరలు పెరగడం వల్ల ఎయిర్‌లైన్స్ కంపెనీలపై ఆర్థిక భారం పెరుగుతుందని, తద్వారా పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


