ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరోసారి ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్ తీవ్ర కలకలం రేపింది. మామిడికుదురు మండలం గెద్దాడ నగరం సమీపంలోని తాడివారి మెరక వద్ద ఉన్న ఓఎన్‌జీసీ రీ-డ్రిల్లింగ్ పాయింట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ లీక్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

స్థానిక అధికారుల కథనం ప్రకారం.. గ్రామ పరిధిలోని మూసివేసిన పాత చమురు బావి వద్ద ప్రస్తుతం ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో రీ-డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున పనులు కొనసాగుతున్న సమయంలో, ఒక్కసారిగా భూమి లోపలి నుంచి భారీ శబ్దంతో కూడిన ఒత్తిడితో గ్యాస్ బయటకు తన్నుకొచ్చింది. గాలి వేగానికి ఈ వాయువు క్రమంగా సమీప గ్రామాల వైపు వ్యాపించడం మొదలైంది.
తెల్లవారుజామున నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా వినిపించిన భారీ శబ్దానికి ఉలిక్కిపడ్డారు. గ్యాస్ వాసన వ్యాపించడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఓఎన్‌జీసీ నిపుణులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా, ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలెవరూ నిప్పు వెలిగించవద్దని, గ్యాస్ స్టవ్‌లు వాడవద్దని అధికారులు మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. నరసాపురం నుంచి ప్రత్యేకంగా బ్లోఅవుట్ కంట్రోల్ టీమ్ గ్రామానికి చేరుకుని గ్యాస్ లీకేజీని అరికట్టే ప్రయత్నాలు చేస్తోంది. లీకవుతున్న గ్యాస్‌కు నిప్పు అంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బందిని భారీగా మోహరించారు.
ఒకవేళ మంటలు చెలరేగినా అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించేందుకు, బావి చుట్టూ నిరంతరాయంగా నీటిని విరజిమ్మే వాటర్ అంబ్రెల్లా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}ఒకవేళ మంటలు చెలరేగినా అవి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించేందుకు, బావి చుట్టూ నిరంతరాయంగా నీటిని విరజిమ్మే వాటర్ అంబ్రెల్లా వ్యవస్థను ఏర్పాటు చేశారు.
{{/usCountry}}గ్యాస్ లీకేజీ తీవ్రత దృష్ట్యా, ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా సమీపంలోని 216వ జాతీయ రహదారి (NH-216) బైపాస్ మార్గంలో వాహనాల రాకపోకలను పోలీసులు పూర్తిగా నిలిపివేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, గ్యాస్ వ్యాప్తిని అరికట్టి లీకేజీని పూర్తిగా నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై ఓఎన్‌జీసీ యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గ్యాస్ లీకేజీని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ఓఎన్జీసీ అధికారులు చేపడుతున్న చర్యలను జిల్లా కలెక్టర్, ఎస్పీ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా అధికారుల సూచలను పాటించాలని కోరారు.
కోనసీమ జిల్లాలో ఓఎన్‌జీసీ బావుల వద్ద గ్యాస్ లీక్ ఘటనలు పునరావృతం కావడం స్థానికులను కలవరపెడుతోంది. ఇదే జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో జనవరి 5న కూడా ఇదే తరహాలో భారీ గ్యాస్ లీక్ సంభవించింది. అంతేకాకుండా గతంలో ఇదే గ్రామంలో గెయిల్ పైప్‌లైన్ పేలుడు ఘటన పెను విషాదాన్ని మిగిల్చిన నేపథ్యంలో, తాజా లీకేజీతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్‌జీసీ భద్రతా ప్రమాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.