...
...
Next Story

Road Accident : ఒంగోలు వద్ద పెళ్లి కారుకు ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Road Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బృందంతో వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.

Updated on: Nov 21, 2026, 09:41:44 IST
Advertisement

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నూతన దంపతులు ప్రాణాలతో బయటపడ్డారు. బాపట్లకు చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు మారుతి సుజుకి ఎర్టిగా కారులో తిరుపతి నుంచి వస్తున్నారు. దర్శనం అనంతరం తిరిగి బాపట్లకు పయనమయ్యారు. శనివారం ఉదయం 6:10 గంటల ప్రాంతంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని పెళ్లూరు సమీపంలో ఉన్న ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ దాటిన తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

ఒంగోలు రోడ్డు ప్రమాదం
ఒంగోలు రోడ్డు ప్రమాదం

తెల్లవారుజాము సమయం కావడంతో కారు నడుపుతున్న డ్రైవర్ ప్రవీణ్ తీవ్రమైన నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి, జాతీయ రహదారి పక్కనే ఉన్న కల్వర్టు గోడను బలంగా ఢీకొట్టింది. ఆ ధాటికి కారు పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న కాలువలోకి బోల్తా పడింది.

కారు కల్వర్టును ఢీకొన్న తీవ్రతకు వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ప్రవీణ్‌తో పాటు కారులో ఉన్న వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇదే కారులో ప్రయాణిస్తున్న నూతన దంపతులు శ్రీతేజ, కైవల్య అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులైన శ్రీతేజ, కైవల్యలను 108 వాహనంలో హుటాహుటిన ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న ఒంగోలు తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో కాలువలో పడిన కారును బయటకు తీసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో బాపట్లలోని వారి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks