ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్ట్.. రూ.5,400 కోట్ల పెట్టుబడులు.. 2,100 మందికి ఉపాధి
ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్ రానుంది. రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ వస్తోంది. దీనితో 2,100 మందికి ఉపాధి కలగనుంది.
పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుంది. ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వర్గాల్లో అనకాపల్లి జిల్లాపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిపై ఫోకస్ పెడుతున్న క్రమంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలకు పెద్ద పీట వేస్తోంది.

ఈ క్రమంలో రెన్యూవబుల్ రంగంలో భారీ పెట్టుబడులతో ఎనర్జీ ప్లాంట్ స్థాపించేందుకు ప్రముఖ రెన్యూ ఎనర్జ్ గ్లోబల్ సంస్థ ముందుకొచ్చింది. క్లీన్ ఎనర్జీ రంగంలోని ప్రధాన సంస్థల్లో ఒకటిగా ఉన్న రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఇప్పటికే దేశంలో 19.2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసి... ప్రముఖ స్థానంలో ఉంది.
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ 6 గిగా వాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. దీంట్లో భాగంగా ఆ ప్లాంట్‌కు భూమి పూజ గురువారం జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేయనున్నారు. మొత్తంగా రూ.5,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయబోయే సంస్థకు భూమి పూజ చేపట్టడంతో అనకాపల్లి జిల్లా అభివృద్ధికి కీలక అడుగులు పడనున్నాయి.
డీకార్బనైజేషన్ రంగంలో ముందంజలో ఉన్న ఈ సంస్థ.. సుమారు రూ.4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యం గల సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయబోతోంది. దీంతో పాటు మరో రూ.1,200 కోట్ల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే రెండేళ్లలో పూర్తి కానున్నాయి.
రెన్యూ సంస్థ నిర్మించే సోలార్ ఇంగాట్-వేఫర్ తయారీ యూనిట్, హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. దీంతో స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించనున్నాయి. ఇంధన రంగం బలోపేతమైతే పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
గతేడాది నవంబర్‌లో విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్టనర్ సమ్మిట్‌కు హాజరైన రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ రాష్ట్రంలో దశలవారీగా రూ.82,000 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. దీంట్లో భాగంగా అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు పనులను ప్రారంభించనుండగా... త్వరలోనే సుమారుగా రూ.22,000 కోట్లతో దేశంలోనే అతిపెద్ద హైబ్రిడ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులలో ఒకదాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రక్రియ చేపట్టనుంది.
ఇప్పటికే ఆర్సెలార్ మిట్టల్, కాగ్నిజెంట్‌కు వంటి ప్రముఖ సంస్థలకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. టీసీఎస్ ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ నెలలో అతిపెద్ద అంతర్జాతీయ పెట్టుబడి గూగుల్ సంస్థకు శంకుస్థాపన చేయనున్నారు. సాఫ్ట్ వేర్, ఎనర్జీ, స్టీల్, మెడ్ టెక్, ఫార్మా వంటి రంగాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టు త్వరలో అందుబాటులోకి రానుంది. మరోవైపు పర్యాటకంగా... ఆధ్యాత్మికంగా కూడా ఉత్తరాంధ్రలో అభివృద్ధి పెద్ద ఎత్తున చోటు చేసుకుంటోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


