...
...
Next Story

విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలి : మంత్రి నారా లోకేశ్

విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు.

Published on: Sep 20, 2026, 17:17:36 IST
Advertisement

సమాజ పురోగతికి, సమగ్ర మార్పునకు విద్య అత్యంత శక్తివంతమైన సాధనమని, అటువంటి పవిత్రమైన విద్యా వ్యవస్థను ఎట్టిపరిస్థితుల్లోనూ రాజకీయాలకు దూరంగా ఉంచాలని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన.. ప్రముఖ ప్రవచనకర్త, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆకుండి లక్ష్మీ స్మారక గోశాల ప్రాంగణంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, మానసిక స్థైర్యం, దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మంత్రి నారా లోకేశ్, చాగంటి కోటేశ్వరరావు
మంత్రి నారా లోకేశ్, చాగంటి కోటేశ్వరరావు

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విద్య, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి అంటే ఎంతో ప్రత్యేకమైన ఆసక్తి అని తెలిపారు. పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

గతంలో బాపట్లలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ అనుభవాన్ని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తు చేసుకున్నారు. 'ఆ రోజు విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్నే ముఖ్యమంత్రికి కూడా అందించాం. భోజనం రుచి చూసిన అనంతరం, పిల్లలకు అందించే ఆహారం క్వాంటిటీ సరిపోదని, దానిని పెంచాల్సిన అవసరం ఉందని సీఎం అక్కడికక్కడే సూచించారు. ఆయన ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని ఆహార ప్రమాణాలను, పరిమాణాన్ని మెరుగుపరిచారు.' అని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఘటనపై మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి ఒక పాఠశాల బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, యువతకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు.

నేటి విద్యా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు. విద్య అనేది కేవలం ఒక డిగ్రీ సాధించడానికో, ఉద్యోగం సంపాదించడానికో పరిమితం కాకూడదని.. అది ఒక మంచి సమసమాజ నిర్మాణానికి ప్రాతిపదికగా మారాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు ఓర్పు, సహనం, నైతిక విలువలు చాలా అవసరమని చెప్పారు.

విద్యార్థులు సొంత ఎదుగుదలతో పాటు దేశం గురించి కూడా ఆలోచించాలని, అవసరమైతే దేశ సేవ కోసం త్యాగాలకు సైతం వెనుకాడకూడదని నారా లోకేస్ పిలుపునిచ్చారు. సంస్కారవంతమైన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. భారతీయం వంటి కార్యక్రమాలు యువతలో సన్మార్గాన్ని, దేశభక్తిని నింపడానికి ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ మానసిక ధైర్యంతో జీవితంలో ముందుకు సాగాలని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks