...
...
Next Story

మురసు తీవ్ర తుపాను ముప్పు... ఓడ రేవుల్లో అలర్ట్.. రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు!

ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుపాను ప్రభావం చూపిస్తోంది. దీంతో ఓడ రేవుల్లో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మరోవాపు పుల రైళ్లు కూడా రద్దు అయ్యాయి.

Published on: Nov 2, 2026, 17:02:06 IST
Advertisement

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురసు ఆంధ్రప్రదేశ్ వైపు వేగంగా దూసుకొస్తోంది. ఆరు గంటలుగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ తుపాను, ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

మురసు సైక్లోన్ అప్డైట్
మురసు సైక్లోన్ అప్డైట్

ప్రస్తుతం ఈ తీవ్ర తుపాను నెల్లూరుకు 110 కి.మీ, కావలికి 130 కి.మీ, తిరుపతికి 160 కి.మీ, ఒంగోలుకు 170 కి.మీ, బాపట్లకు 190 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను కారణంగా సముద్రం తీవ్ర అలజడిగా మారడంతో ఏపీలోని ప్రధాన హార్బర్లు, పోర్టులలో ప్రమాద సూచికలను జారీ చేశారు.

నిజాంపట్నం, వాడరేవు హార్బర్‌లకు 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక, మచిలీపట్నం పోర్టుకు 9వ నంబర్ ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నం పోర్టు 8వ నంబర్ ప్రమాద హెచ్చరిక, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, భీమునిపట్నం, కళింగపట్నం పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

తుపాను ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా బాపట్ల, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. బాపట్ల జిల్లాలోని ప్రసిద్ధ సూర్యలంక బీచ్‌కు పర్యాటకులు, స్థానికులు ఎవరూ రావొద్దని పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

బాధితులు, ప్రజల సాయం కోసం జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు అందుబాటులోకి వచ్చాయి. గుంటూరు జిల్లా కంట్రోల్ రూమ్: 9440827526, బాపట్ల జిల్లా కంట్రోల్ రూమ్: 9281413774ను సంప్రదించవచ్చు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ వెళ్లే విమానాలు రద్దయ్యాయి. విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇండిగో సంస్థ హైదరాబాద్, విశాఖ, బెంగళూరు, చెన్నై, ముంబయి, తిరుపతి, కర్నూలు మార్గాల్లో నడిచే 12 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఎయిర్ ఇండియా సంస్థ కూడా హైదరాబాద్, విశాఖపట్నం విమానాలను రద్దు చేసింది. ప్రయాణానికి ముందే ఆయా ఎయిర్‌లైన్స్ వెబ్‌సైట్లలో లైవ్ స్టేటస్ చెక్ చేసుకోవాలని విమానాశ్రయ అధికారులు సూచించారు.

నెల్లూరు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచే వర్షాలు పడుతున్నాయి. కాకినాడ నగరంలోని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు ఇప్పటికే జలమయమయ్యాయి. తుని, అమలాపురం, అంబాజీపేట పరిసర ప్రాంతాల్లో చినుకులు పడుతుండగా, గాలుల వేగం క్రమంగా పెరుగుతోంది. తీర ప్రాంత ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks