సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(CUAP)లో 2026–27 విద్యా సంవత్సరం నుండి అనేక కొత్త పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ఏ కోరి ప్రకటించారు. వాటిలో జెనోమిక్ సైన్స్‌లో MSc, కెమిస్ట్రీలో MSc, MCA ఉన్నాయి.

ప్రొఫెసర్ కోరి మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానం 2020, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ, పరిశోధన అవసరాలకు అనుగుణంగా విద్యాపరమైన ఆఫర్‌ల కోసం విశ్వవిద్యాలయం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ కొత్త కార్యక్రమాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో బిటెక్ ప్రోగ్రామ్(CSE) ప్రవేశపెట్టడంతో, ఆచరణాత్మక, నైపుణ్య ఆధారిత అభ్యాసాన్ని బలోపేతం చేయడానికి కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు అప్‌గ్రేడ్ అయ్యాయని అన్నారు.
అనంతపురం నుండి 15 కి.మీ దూరంలో జంతలూరు వద్ద 492 ఎకరాల్లో విస్తరించి ఉంది సీయూఏపీ. ప్రస్తుతం బాలురు, బాలికల కోసం ప్రత్యేక హాస్టళ్లలో 700 మందికి పైగా విద్యార్థులకు వసతి కల్పిస్తోంది. ఆకర్షణీయమైన ప్యాకేజీలతో క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లను పొందుతున్నారు.
యూజీ కోర్సులు
ఈ విశ్వవిద్యాలయం ప్రస్తుతం ఎనిమిది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది, వాటిలో బిటెక్ (సిఎస్‌ఇ), బీఎస్సీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), బీఏ(పొలిటికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్), బీఎస్సీ (సైకాలజీ), బీకాం, బీబీఏ, బీఎస్సీ (రిటైల్ మేనేజ్‌మెంట్) ఉన్నాయి.
పీజీ కోర్సులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో సీయూఏపీ 17 ప్రోగ్రామ్‌లను అందిస్తుంది. వాటిలో MSc స్పేస్ సైన్స్ టెక్నాలజీ, MSc క్లినికల్ సైకాలజీ, MSc మ్యాథమెటికల్ అండ్ కంప్యూటింగ్ సైన్సెస్, MSc ఎకనామిక్స్, MA ఇన్ ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, హిందీ, తెలుగు, ఎంబీఏ, ఎంకామ్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. కొత్తగా ప్రకటించిన MSc జెనోమిక్ సైన్స్, MSc కెమిస్ట్రీ, BTech(CSE) కోర్సులు అవకాశాలను మరింత విస్తరిస్తాయని ప్రొఫెసర్ కోరి అన్నారు.
స్టూడియో ఏర్పాటు
తదుపరి సెమిస్టర్‌లో ప్రతి ప్రోగ్రామ్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన విద్యార్థికి 20 శాతం ఫీజు మినహాయింపు ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. డిజిటల్, బ్లెండెడ్ లెర్నింగ్‌కు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక ఇ-స్టూడియో ఏర్పాటును కూడా వైస్-ఛాన్సలర్ ప్రకటించారు. ఎన్ఈపీ 2020, జాతీయ డిజిటల్ విద్యా లక్ష్యాలకు అనుగుణంగా హై క్వాలిటీ ఈ-కంటెంట్, ఆన్‌లైన్ కోర్సులు, పాడ్‌కాస్ట్‌లను రూపొందించడానికి ఈ సౌకర్యాలను ఉపయోగిస్తారు.