AP MPTC ZPTC Elections 2026 : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల భర్తీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌తో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసేందుకు వీలుగా సమగ్ర షెడ్యూల్‌ను అధికారులు వెల్లడించారు.
ముఖ్యమైన తేదీలు :
- నామినేషన్ల స్వీకరణ : ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు.
- నామినేషన్ల పరిశీలన : దాఖలైన నామినేషన్లను ఈ నెల 24వ తేదీన అధికారులు కూలంకషంగా పరిశీలిస్తారు.
- నామినేషన్ల ఉపసంహరణ : పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఈ నెల 27వ తేదీ వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి గడువు ఇచ్చారు.
- పోలింగ్ తేదీ : నవంబర్ 3వ తేదీన ఉదయం నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు.
- అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 4న రీపోలింగ్ చేపడతారు.
- నవంబర్ 5న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పరిషత్ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుండటంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు, పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు అప్పుడే వ్యూహాలకు పదును పెడుతున్నారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసేలా స్థానిక పోలీస్ యంత్రాంగంతో కలసి ఎన్నికల అధికారులు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లా పరిషత్‌లు, 659 జెడ్పీటీసీ, 659 ఎంపీపీ, 9,829 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 2,81,34, 518 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
- అమరావతిలోని నాలుగు మండలాలను మినహాయించి మిగిలిన 659 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ వివరించారు.
- అన్ని చోట్ల వెబ్‌కాస్టింగ్ సదుపాయం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు.
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు చోట్ల ఘర్షణలు తలెత్తగా… ప్రాదేశిక ఎన్నికల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోనున్నారు.