ఏపీ స్థానిక పోరు - ఎంపీపీ, జెడ్పీ ఛైర్‌పర్సన్ల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

AP MPP ZP chairperson Elections : ఆంధ్రప్రదేశ్ లో ఎంపీపీ, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పరోక్ష ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 19న మండల పరిషత్, 20న జిల్లా పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి.

Published on: Nov 11, 2026, 05:12:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

AP MPP ZP chairperson Elections : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తదనంతర ఘట్టానికి రాష్ట్ర ఎన్నికల సంఘం వేదిక సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 659 మండల ప్రజా పరిషత్‌లు, 28 జిల్లా ప్రజా పరిషత్‌ల పరిధిలో అధ్యక్ష, ఉపాధ్యక్ష, ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ నోటిఫికేషన్లు జారీ చేశారు.

ఎంపీపీ, జెడ్పీ ఛైర్‌పర్సన్ల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల (AI Image Gemini)
ఎంపీపీ, జెడ్పీ ఛైర్‌పర్సన్ల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల (AI Image Gemini)

ఇటీవల నవంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ నిర్వహించగా… తుఫాన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లాలో నాలుగు మండలాల్లో నవంబర్ 6న వాయిదా పడిన పోలింగ్ పూర్తి చేశారు. కొన్ని చోట్ల ఫిర్యాదుల ఆధారంగా 7 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపి…. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించారు.

తాజా నోటిఫికేషన్ ప్రకారం….. మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు నవంబర్ 19న, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు నవంబర్ 20న పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రిసైడింగ్ అధికారులు ఆయా తేదీల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేస్తారు.

కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక విధానం…

ముందుగా ప్రతి ఎంపీపీలో ఒకరిని, ప్రతి జెడ్పీపీలో ఇద్దరిని కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాతే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, జెడ్పీపీ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 131 (తేదీ: 11.03.1995) ప్రకారం.. మతపరమైన మైనారిటీలు (ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు) లేదా తెలుగు మాతృభాష కాని భాషాపరమైన మైనారిటీలకు చెందిన వారు ఈ కో-ఆప్టెడ్ సభ్యులుగా ఉండేందుకు అర్హులు.

ఈ పరోక్ష ఎన్నికలను సభ్యులు 'చేతులు పైకెత్తే' పద్ధతిలో నిర్వహిస్తారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జారీ చేసే విప్‌ను ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అయితే కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికకు విప్ వర్తించదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్-అఫీషియో సభ్యులుగా హాజరయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వారికి ఓటు వేసే హక్కు ఉండదు. ఎన్నికల్లో పాల్గొనే సభ్యులకు నవంబర్ 14లోగా నోటీసులు అందజేస్తారు. ఎన్నికల ప్రక్రియ సుఫీణంగా పూర్తి చేసేందుకు ఎస్‌ఈసీ విస్తృత మార్గదర్శకాలను జారీ చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More