ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. ఈ మేరకు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదముద్ర పడింది.

గురువారం రాజ్యసభలో ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను అందుకుంటుంది. 'వికసిత్ భారత్' సాధించడంలో ప్రధాని నరేంద్ర మోదీ కల మరియు సంకల్పాన్ని నెరవేర్చడంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తుందని మేము ఆశిస్తున్నాము" అని కేంద్రమంత్రి నిత్యానందరాయ్ అన్నారు.
పలు పార్టీలు మద్దతు…
బిల్లుకు మద్దతు తెలుపుతూ టీడీపీ ఎంపీ మస్తాన్ రావు యాదవ్ మాట్లాడారు. చాలా ప్రణాళికల తర్వాత అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని వివరించారు. టీడీపీ సభ్యుడు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సహా పలువురు సభ్యులు కూడా బిల్లుకు మద్దతు తెలిపారు.
అమరావతికి చట్టబద్ధత కల్పించే ఈ బిల్లును కేంద్రం… బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదం తెలిపింది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం- 2014లోని సెక్షన్ 5(2)కి సవరణ చేస్తూ రూపొందించిన బిల్లును హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టారు.
లోక్ సభలో ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది.మరోవైపు అమరావతి చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్ చేసింది. ఇవాళ రాజ్యసభలోనూ వాకౌట్ చేసింది.
ఈ బిల్లుకు లోక్ సభతో పాటు రాజసభ్యోలనూ ఆమోదముద్ర లభించటంతో రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు. ఇక్కడ సంతకం చేస్తే… అధికారికంగా గెజిట్ విడుదలవుతుంది. తద్వారా అమరావతి ఏపీ రాజధానిగా గుర్తింపు పొందనుంది. ఫలితంగా అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభిస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.