...
...
Next Story

ఉత్తరాంధ్ర స్వరూపాన్నే మార్చేసే విప్లవాత్మక శక్తి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ : ప్రధాని మోదీ

భోగాపురం విమానాశ్రయం కేవలం ఒక మౌలిక వసతి ప్రాజెక్టు మాత్రమే కాదని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల స్వరూపాన్నే మార్చేసే విప్లవాత్మక శక్తి అని స్పష్టం చేశారు.

Published on: Aug 1, 2026, 14:27:03 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని' ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా జాతికి అంకితం చేశారు. దీనితో పాటు రాష్ట్ర సమగ్ర పురోగతికి ఊతమిచ్చే రూ.18,000 కోట్ల విలువైన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని అందరికీ నమస్కారం అని తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. సింహాచలం అప్పన్న స్వామికి, విజయనగరం పైడితల్లి అమ్మవారికి శిరస్సు వంచి ప్రణామాలు సమర్పించారు.

ఏపీ ప్రగతిలో ఒక శుభదినమని, రూ.18,000 కోట్ల ప్రాజెక్టులు రాష్ట్ర రూపురేఖలను వేగంగా మారుస్తాయని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కేవలం విమానాల రాకపోకలకే పరిమితం కాదని, ఇది ఉత్తరాంధ్ర వికాసానికి కొత్త రన్‌వేగా, ఆంధ్రా యువత కలలకు లాంచ్‌పాడ్‌లా ఉపయోగపడుతుందని కొనియాడారు.

గతంలో విమానాశ్రయం నిర్మిస్తే ఒకే కుటుంబం పేర్లు పెట్టే సంస్కృతి ఉండేదని.. కానీ తమ ప్రభుత్వం అయోధ్యలో మహర్షి వాల్మీకి, పంజాబ్‌లో సంత్ రవిదాస్ పేర్లు పెట్టినట్లే, ఇక్కడ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో గౌరవించుకున్నామని మోదీ గుర్తుచేశారు.

2014 నాటికి దేశంలో కేవలం 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. కానీ గడిచిన 12 ఏళ్లలో కొత్తగా 166 విమానాశ్రయాలను నిర్మించి మొత్తం సంఖ్యను భారీగా పెంచామన్నారు. ఉడాన్ పథకం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలు కూడా తమ సొంత ప్రాంతాల నుంచే విమానం ఎక్కేలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.

శంషాబాద్ విమానాశ్రయం తెలంగాణ అభివృద్ధి పథాన్ని మార్చినట్లే, భోగపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అన్నారు. "భోగపురం విమానాశ్రయానికి మా ప్రభుత్వమే శంకుస్థాపన చేసింది, ఇప్పుడు ఆ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించింది కూడా మా ప్రభుత్వమే" అని అన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ. 6.13 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం ఆకర్షించిందని చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక 5.57 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాయని ఆయన చెప్పారు.

మోదీని విమర్శిస్తే బాధపడ్డా : పవన్ కళ్యాణ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికత దేశంలోని ప్రతి రంగంలో పరివర్తనను తీసుకువస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. కష్టపడి పనిచేస్తున్న ప్రధానికి అనేక అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో మోదీని విమర్శిస్తుంటే బాధపడ్డానని తెలిపారు. దేశాన్ని అభివృద్ధిపథంలో తీసుకెళ్లడం ఎంత కష్టమో ఆలోచించాలన్నారు. తనను దూషించేవారిని క్షమించే గుణం మోదీది అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe