వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద.. 70 గేట్లు ఎత్తి నీటి విడుదల

మురసు తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మెుత్తం 70 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

Published on: Nov 4, 2026, 15:02:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మురసు తుపాను ప్రభావంతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నీటి వనరుల శాఖ కాలువలకు నీటి విడుదలను నిలిపివేసి, ప్రకాశం బ్యారేజీకి ఉన్న మొత్తం 70 గేట్లను ఎత్తివేసింది. దీని ద్వారా అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటి విడుదల
ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి నీటి విడుదల

బుధవారం ఉదయం 8 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజీకి 71,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, ఆ నీటినంతటినీ కృష్ణా నది ద్వారా బంగాళాఖాతం వైపు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద నీటి మట్టం 12 అడుగులుగా నమోదైంది. మురసు తుపాను కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి ఉన్న మొత్తం 70 గేట్లను అధికారులు ఎత్తారు.

నీటి విడుదలను సులభతరం చేసేందుకు, 30 గేట్లను రెండు అడుగుల మేర, మరో 40 గేట్లను ఒక అడుగు మేర పైకి ఎత్తారు. వరద ముప్పును దృష్టిలో ఉంచుకుని, కృష్ణా తూర్పు, పశ్చిమ కాలువలు, గుంటూరు కాలువలకు నీటి విడుదలను నీటి వనరుల శాఖ అధికారులు నిలిపివేశారు.

స్థానిక పరీవాహక ప్రాంతాల నుంచి కీసర, మున్నేరు, బుడమేరు వాగుల ద్వారా బ్యారేజీలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో, మంగళవారం రాత్రి నుంచే బ్యారేజీ నుంచి అదనపు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు.

ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటం, భారత వాతావరణ శాఖ మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉందని సూచించిన నేపథ్యంలో, నీటి విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. నదిలోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని, ఎగువ ప్రాంతాల్లోని పరిస్థితులను అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. కృష్ణా నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, గణాంక శాఖ (APDES) నివేదిక ప్రకారం బుధవారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులో అత్యధికంగా 269.45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పదహారు ఆటోమెటిక్ వాతావరణ కేంద్రాల వద్ద నమోదైన వర్షపాతం 204.5 మి.మీ. మార్కును దాటింది.

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలంలోని చింతలపాడులో 178.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. కృష్ణా జిల్లాలోని ఘంటసాలలో 222.75 మి.మీ. వర్షపాతం కురిసింది.

తుపాను తీరం దాటే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దీని ప్రభావంతో బాపట్ల, గుంటూరు, కృష్ణా, పల్నాడు, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సూచనలను తప్పక పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More