Srisailam Temple : తిరుమల తరహలోనే శ్రీశైలంలో సంస్కరణలు - ఆగస్టు 15 నుంచే కొత్త రూల్స్..! వీటిని తెలుసుకోండి
Srisailam Temple Protocol Darshan : శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆగస్టు 15 నుంచి సిఫార్సు లేఖల ప్రోటోకాల్ దర్శనాలను ఆన్‌లైన్ ద్వారానే జారీ చేయనున్నారు. సామాన్య భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.
Srisailam Devasthanam Board Decisions : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల దర్శనాల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు దేవస్థానం ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీశైల దేవస్థానంలో ప్రొటోకాల్ దర్శనాల్లో సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యులందరితో విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ మార్పులను ఖరారు చేశారు.

ఈ కీలక సమావేశంలో 45 అంశాలపై సమగ్రంగా చర్చించి…. అందులో 39 కీలక అంశాలకు ఆమోదముద్ర వేశారు. సాధారణ భక్తులు గంటల తరబడి వేచి ఉండే ఇబ్బందులు తొలగించి, మరింత సులభంగా దర్శనం కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని ధర్మకర్తల మండలి ఛైర్మన్ రమేష్ నాయుడు స్పష్టం చేశారు.
ఆగస్టు 15 నుంచి కొత్త విధానం
- నూతన రూల్స్ ప్రకారం… ప్రజాప్రతినిధులు, ప్రముఖుల సిఫార్సు లేఖలపై ఇచ్చే ప్రోటోకాల్ టికెట్లను వచ్చే నెల ఆగస్టు 15వ తేదీ నుంచి ఆన్‌లైన్ ద్వారానే జారీ చేస్తారు.
- ఈ ప్రోటోకాల్ దర్శనం కోరుకునే వారు దర్శన సమయానికి కనీసం 48 గంటల ముందే తమ సిఫార్సు లేఖలను ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
- ఈ మార్పు ద్వారా భక్తుల రద్దీని సులభంగా నియంత్రించడంతో పాటు, దర్శన వేళల్లో మరింత పారదర్శకత వస్తుందని పాలకమండలి భావిస్తోంది.
- ప్రముఖుల సిఫార్సు లేఖల పేరిట జరిగే అక్రమాలను అరికట్టడంతో పాటు, సాధారణ భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా వేగంగా దర్శనం పొందేందుకు ఈ చర్యలు ఎంతగానో తోడ్పడతాయని ఆలయ ఛైర్మన్ పేర్కొన్నారు.
మరిన్ని నిర్ణయాలు..
ఇక శ్రీశైలం క్షేత్రాభివృద్ధిలో భాగంగా భక్తుల వసతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. నూతన క్యూ కాంప్లెక్స్, ఏ-గ్రేడ్ శౌచాలయాలు, స్నానపు గదుల నిర్మాణం, తిరుమల తరహాలో పీఏసీ (పిలిగ్రిమ్ ఎమినిటీస్ కాంప్లెక్స్) ఏర్పాటును ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని నిర్ణయించారు. భక్తుల రాకపోకల సౌకర్యార్థం హిందూమాల సత్రం నుంచి కుమార సదనం వరకు…. యోగివేమారెడ్డి సత్రం వెనుక భాగంలో రూ. 24 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా సిమెంట్ కాంక్రీట్ రోడ్డును నిర్మించనున్నారు.
రాబోయే శ్రావణ మాసంలో భక్తుల భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన గోపురాలకు రంగురంగుల విద్యుద్దీపాలంకరణ చేయనున్నారు. భక్తుల విశ్రాంతి కోసం నందీశ్వర మరియు నీలకంఠేశ్వర డార్మెటరీలలో డక్టబుల్ ఎయిర్ కూలర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అలాగే క్యూ కాంప్లెక్సులో అదనపు వాటరు కూలర్లను అమర్చనున్నారు.
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి…. సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండి దేశం సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ ఆగమశాస్త్రానుసారంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆగస్టు 7 నుంచి 11వ తేదీ వరకు వరుణయాగ సహిత సహస్రఘటాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక అర్చనలు, హోమాలు, జపాలు మరియు పారాయణలు శాస్త్రోక్తంగా జరుగుతాయి.
శాకంభరీ ఉత్సవాలు, రాబోయే శ్రావణ మాసోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. శ్రీశైల దేవస్థానం దత్తత దేవాలయమైన కొలనుభారతిలో ఆగస్టు 7న (శుక్రవారం) సరస్వతీ అమ్మవారికి శాకంభరీ ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

