రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - మార్చి 1 నుంచి 'రైల్ వన్' వచ్చేస్తోంది...! ఇక అన్ని సేవలు అందులోనే...!

రైల్వేశాఖ మరో కొత్త యాప్ ను తీసుకువస్తోంది. యూటీఎస్ స్థానంలో రైల్ వన్ (RailOne) యాప్ ప్రవేశపెట్టబోతుంది. ఈ యాప్ మార్చి 1వ తేదీన అందుబాటులోకి వస్తుంది. రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, లైవ్ రైల్ ట్రాకింగ్, ఆహార ఆర్డర్లు,ఫిర్యాదు సేవలను ఒకేచోట పొందొచ్చు. 

Published on: Feb 22, 2026, 12:59:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు రైల్వేశాఖ సరికొత్ సేవలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అన్‌రిజర్వ్ డ్ టిక్కెట్ల కోసం వాడుతున్న యూటీఎస్ యాప్ సేవను నిలిపివేసి… ఆ స్థానంలో మరో కొత్త యాప్ ను తీసుకురానుంది.

రైల్ వన్ యాప్ వచ్చేస్తోంది...!
రైల్ వన్ యాప్ వచ్చేస్తోంది...!

మార్చి 1 నుంచి రైల్ వన్…

రైల్వే శాఖ అందించే అన్ని సేవలను ఒకే చోట అందించేందుకు ‘రైల్‌వన్ యాప్‌’ను సిద్ధం చేసింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ యాప్ ప్రయాణికులను అందుబాటులోకి రానుంది. ప్రయాణీకులు ఇకపై రైల్‌వన్ యాప్‌ను వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచిస్తోంది.

ఈ కొత్త యాప్‌ ద్వారా టికెట్‌ రిజర్వేషన్‌, అన్‌ రిజర్వ్‌డ్‌ , ప్లాట్‌ఫాం టికెట్ల కొనుగోలు, పీఎన్‌ఆర్‌ ఎంక్వయిరీ, జర్నీ ప్లానింగ్‌, రైల్వే స్టేషన్లలో బోగీల పొజిషన్‌, రైలు ప్రయాణ స్థితి, రైలు సహాయ సేవలు, ప్రయాణ సమయంలో మీల్స్‌ బుకింగ్‌ వంటి పలు సేవలను ఒకే వేదిక ద్వారా పొందే వీలు ఉంటుంది. గతంలో పలు సేవలకు వేర్వేరు యాప్‌లు ఉండేవి. కానీ ప్రయాణికులకు ఒకే చోట ఈ సేవలన్నీ అందించాలనే ఉద్దేశ్యంతో… రైల్ వన్ యాప్ ను సిద్ధం చేసింది.

అండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాపిల్ ఫోన్ యూజర్లు apps.apple.com/in/ నుంచి రైల్ వన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైల్‌ వన్‌లో ఒకే లాగిన్‌, ఒకే పాస్‌వర్డ్‌తో అన్ని సేవలను సులభంగా పొందే వీలుంటుంది. ఈ యాప్‌కు రైల్వే ఈ-వ్యాలెట్‌ను కూడా జోడిస్తారు. ‘సూపర్‌ యాప్‌’గా ఇది రైలు ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తుందని రైల్వేశాఖ చెబుతోంది.

ప్రయాణంలో ఏదైనా సమస్య వస్తే రైల్‌మాడద్ ద్వారా వెంటనే ఫిర్యాదు చేసే సదుపాయం కూడా ఈ రైల్ వన్ యాప్ ఉంటుంది. ఇప్పటికే UTS యాప్‌లో కొత్త రిజిస్ట్రేషన్లు, సీజన్ టిక్కెట్ల పునరుద్ధరణను నిలిపివేశారు. ప్రయాణీకులు తమ పాత UTS లేదా IRCTC లాగిన్ వివరాలతోనే రైల్‌వన్ యాప్‌లోకి సులభంగా సైన్-ఇన్ అవ్వొచ్చని అధికారులు సూచిస్తున్నారు.

ఈ యాప్ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే ఆన్ రిజర్వుడ్ టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా ఆన్ రిజర్వ్ డ్ టికెట్లు బుకింగ్ చేసుకుంటే 3 శాతం డిస్కౌంట్ కూడా పొందొచ్చని వివరిస్తున్నారు.

యూటీఎస్ యాప్‌ సేవలను నిలిపివేస్తున్న నేపథ్యంలో అందులోని ఆర్-వ్యాలెట్ లోని బ్యాలెన్స్ గురించి ప్రయాణీకులు ఆందోళన చెందొద్దని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైల్‌వన్ యాప్‌లోకి మారినప్పుడు పాత బ్యాలెన్స్ ఆటోమేటిక్‌గా ఇందులో జమవుతుందని పేర్కొంటున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More