Weather Report : తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, ఐఎండీ అంచనాలు ఇలా

AP Telangana Weather Updates : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు, తెలంగాణలో గంటకు 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.

Published on: Aug 5, 2026, 08:33:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంపై బలమైన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ ఆవర్తన ప్రభావంతో రాబోయే రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.

ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్
ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం… ఇవాళ (ఆగస్ట్ 05, 2026) ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడొచ్చు.

వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని స్పష్టం చేశారు.

తెలంగాణకు వర్ష సూచన…

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం…. తెలంగాణలోనూ వర్ష ప్రభావం తీవ్రంగా ఉండనుంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే వీలుంది.

ఇవాళ కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో తేలికపాటి లేదా ఉరుములతో కూడిన వర్షం పడొచ్చు. ఆయా జిల్లాల్లో 40 కిమీ వేగంతో గాలులు వీచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఆగస్టు 10వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, వరద దాటికి… కృష్ణా బేసిన్‌లో నీటి ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. శ్రీశైలంలోకి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం రిపోర్ట్ ప్రకారం… 2,39,891 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా…. ఇంకా పెరిగే అవకాశం ఉంది. జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, జూరాల కుడి, ఎడమకాలువలతో సహా అన్ని కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది.

శ్రీశైలం మొత్తం నీటి సామర్థ్యం 215.810 టీఎంసీలుగా కాగా… ఇవాళ ఉదయానికి నీటినిల్వ 118.622 టీఎంసీలకు చేరింది. మరో 97 టీఎంసీలు చేరితే… ప్రాజెక్ట్ నిండుకుండలా మారిపోతుంది. ప్రస్తుతం ఔట్ ఫ్లో 800 క్యూసెకులుగా నమోదైంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More