Railway Updates : నవంబర్ 10 నుంచి 48 రోజులు చాలా రైళ్ల రద్దు, దారిమళ్లింపులు!

Railway Updates : నవంబర్ 10 నుంచి రేణిగుంట రైల్వే స్టేషన్ యార్డ్ ఆధునీకరణ పనులు జరగనున్నాయి. దీంతో భారీగా రైళ్ల రద్దు, దారి మళ్లింపులు ఉన్నాయి.

Published on: Sep 30, 2026, 15:26:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి సమీపంలోని రేణిగుంట రైల్వేస్టేషన్ యార్డ్‌లో మౌలిక వసతుల పెంపు, ఇంటర్ లాకింగ్ పనుల దృష్ట్యా దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నవంబరు 10 నుంచి డిసెంబరు 27 వరకు దాదాపు 48 రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్ల మార్గాలను మళ్లిస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే జోనల్ అధికారి విజయ్‌కిషన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రైలు మార్గాల ఆధునీకరణ పనుల కారణంగా నిత్యం ప్రయాణించే ప్రయాణికులు, ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్యాసింజర్ రైళ్లు 48 రోజుల పాటు పూర్తిగా రద్దు చేశారు. కడప - అరక్కోణం, తిరుచానూరు - అరక్కోణం, చెన్నై - తిరుచానూరు, గూడూరు - రేణిగుంట, నెల్లూరు - రేణిగుంట మార్గాల్లో నిత్యం రాకపోకలు సాగించే రోజువారీ ప్యాసింజర్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.

సప్తగిరి ఎక్స్‌ప్రెస్: చెన్నై - తిరుపతి నడుమ నిత్యం తిరిగే ప్రజాదరణ పొందిన సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ను మొత్తం 27 రోజుల పాటు నిలిపివేస్తున్నారు.

తిరుపతి - విశాఖ డబుల్ డెక్కర్: తిరుపతి మరియు విశాఖపట్నం మధ్య వారంలో మూడు రోజులు నడిచే డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్‌ను డిసెంబరు 9 నుండి 26 వరకు (ఆది, సోమ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో) రద్దు చేశారు.

వీక్లీ రైళ్లు: తిరుచానూరు నుండి నాందేడ్, జాల్నా, కాచిగూడ, చర్లపల్లి వెళ్లే వారాంతపు ఎక్స్‌ప్రెస్‌లను రెండు సేవల చొప్పున నిలిపివేశారు. రేణిగుంట - మైసూర్ ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 11, 12, 18, 19, 25, 26 తేదీల్లో నడవదు. తిరుపతి - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 12, 13, 14, 19, 20, 21, 26, 27 తేదీల్లో రద్దు అయింది. రేణిగుంట - నిశ్చింతపూర్ మధ్య నడిచే 4 సరుకు రవాణా రైళ్లను రద్దు చేశారు.

రేణిగుంట జంక్షన్ మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే దాదాపు 73 ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో నడపనున్నారు. ముంబాయి, హౌరా, ఢిల్లీ, కన్యాకుమారి, చెన్నై, త్రివేండ్రం, బెంగళూరు, మైసూర్ వైపు వెళ్లే రైళ్లు కొన్ని గుత్తి - ధర్మవరం మీదుగా, మరికొన్ని గూడూరు - పెరంబూరు మార్గాల్లో ప్రయాణిస్తాయి.

రేణిగుంట నుండి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే దూద్ దొరంతో పాల రవాణా రైలును రేణిగుంట - ఎర్రగుంట్ల - నంద్యాల - గుంటూరు - విజయవాడ మార్గంలో మళ్లించారు. ఈ సుదీర్ఘ మరమ్మతుల దృష్ట్యా ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను సరిచూసుకుని, రైల్వే విచారణ కేంద్రం లేదా అధికారిక యాప్‌ల ద్వారా సమాచారం తెలుసుకుని ప్రయాణించాలని అధికారులు సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More