...
...
Next Story

YS Jagan : రీపోలింగ్ పెట్టాల్సిందే.. పులివెందులలో ఓటు వేయని జగన్

YS Jagan : పులివెందులలో వైఎస్ జగన్ ఓటు వేయకుండానే వెళ్లిపోయారు. రీపోలింగ్ పెడితేనే వచ్చి మళ్లీ ఓటు వేస్తానని చెప్పారు. ఈ ఎన్నికలు చూస్తే.. సంస్కరణలు ఎంత అవసరమో తెలుస్తుందని పేర్కొన్నారు.

Updated on: Nov 1, 2026, 15:57:20 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓటు వేయకుండానే నిరసనగా వెనుదిరిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద తీవ్ర అక్రమాలు జరుగుతున్నాయని, తమ పార్టీ ఏజెంట్లను లోపలికి అనుమతించడం లేదని ఆరోపిస్తూ ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

పులివెందులలో ఓటు వేయని జగన్
పులివెందులలో ఓటు వేయని జగన్

పోలింగ్ సరళిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వైఎస్ జగన్, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు. 'రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులు ప్రజలందరికీ తెలియాలి. ఇప్పుడు నేను వచ్చి ఓటు వేస్తే ఇక్కడ అంతా సవ్యంగానే జరుగుతోందనే తప్పుడు భ్రమ కలుగుతుంది. కానీ, ప్రస్తుతం ఇక్కడ కనీసం ఓటు వేసేందుకు కూడా అనుకూల పరిస్థితులు లేవు. పులివెందులలో రీ-పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నా. రీ-పోలింగ్ పెడితేనే మళ్లీ వచ్చి ఓటు వేస్తాను.' అని జగన్ స్పష్టం చేశారు.

అంతకుముందు పులివెందులలోని పోలింగ్ కేంద్రాల్లో తమ ఏజెంట్లను అడ్డుకున్నారంటూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే వైఎస్ జగన్ నేరుగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. నేలపైనే తన పార్టీ ఏజెంట్లతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తన వద్దకు వచ్చిన ఆర్వోకు అధికారికంగా వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్, కూటమి ప్రభుత్వం, అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు అధికారులందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో తోలుబొమ్మలుగా మారారని, రాజ్యాంగబద్ధ వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల విధానాన్ని చూస్తుంటే దేశంలో ఎన్నికల సంస్కరణలు ఎంత అవసరమో స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

మరోవైపు కొన్ని ప్రాంతాల్లో రిగ్గింగ్ జరిగినట్టుగా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. అనంతపురం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ కూటమి రిగ్గింగ్ చేసిందని తెలిపింది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నేతృత్వంలో పోలింగ్ కేంద్రాలను ఆక్రమించిన కూటమి నేతలు.. 39వ డివిజన్ లో వైయ‌స్ఆర్‌సీపీ నేత లపై కర్రలతో దాడులు చేశాని తెలిపింది. 30వ డివిజన్‌లో టీడీపీ, బీజేపీ నేతల రిగ్గింగ్ చేశారని వెల్లడించింది. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పల్నాడు జిల్లా వినుకొండ 8వ వార్డు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అర్చన మూర్తి దంపతులపై పోలింగ్ కేంద్రంలో పలవురు దాడి చేశారు. అర్చన మూర్తి దంపతులను పోలింగ్ కేంద్రంలో నుంచి బయటికి లాగి విచక్షణారహితంగా కొట్టారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks