Papikondalu Boat Tourism : ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ తీపి కబురు అందించింది. ఎంతో ప్రాచుర్యం పొందిన ప్రసిద్ధ పాపికొండల విహారయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. గత నెల 26వ తేదీన సంభవించిన 'అర్నబ్' తుఫాను తీవ్ర ప్రభావం కారణంగా గోదావరి నదిలో పర్యాటక బోటు ప్రయాణాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రస్తుతం నదీ పరివాహక ప్రాంతంలో వాతావరణం అనుకూలించడంతో పాటు ప్రవాహం సాధారణ స్థితికి రావడంతో తిరిగి బోటు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు.
పోలవరం జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో కొలువుదీరిన పాపికొండలు ప్రకృతి రమణీయతకు నిలయం. పచ్చని అడవులు, ఎత్తైన కొండల నడుమ పరవళ్లు తొక్కే గోదావరి నదిలో సాగే పడవ ప్రయాణం పర్యాటకులకు మైమరిపించే అనుభూతిని అందిస్తుంది. అయితే….. అర్నబ్ తుఫాను సృష్టించిన అలజడితో గోదావరిలో నీటి ప్రవాహం పెరిగి పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి. దీంతో పర్యాటకుల ప్రాణ భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇస్తూ అధికారులు యాత్రను కొద్దిరోజుల కిందట తాత్కాలికంగా రద్దు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడంతో విహారయాత్రను పునఃప్రారంభించారు.
బోటింగ్ పాయింట్స్…
పాపికొండల యాత్ర పునఃప్రారంభమైన నేపథ్యంలో పర్యాటకుల సౌకర్యార్థం రెండు వేర్వేరు పాయింట్ల నుంచి బోటు సర్వీసులను అధికారులు ఏర్పాటు చేశారు.
- పోలవరం జిల్లాలోని ప్రసిద్ధ గండిపోశమ్మ ఆలయ ఘాట్ నుంచి కొన్ని బోట్లు బయలుదేరుతాయి.
- పోచవరం పాయింట్ నుంచి మరికొన్ని బోట్లను అందుబాటులో ఉంచారు.
పర్యాటకులు తమ ప్రయాణ ప్రణాళికకు అనుగుణంగా అనుకూలమైన ప్రాంతం నుంచి పాపికొండల విహారయాత్రను ప్రారంభించే వీలుంది. పాపికొండల యాత్రకు వెళ్లే పర్యాటకులు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. ప్రయాణానికి ముందే వాతావరణ పరిస్థితులు, పర్యాటక శాఖ మరియు స్థానిక అధికారుల భద్రతా మార్గదర్శకాలను తెలుసుకోవడం శ్రేయస్కరం. బోటు నిర్వాహకులు అందించే లైఫ్ జాకెట్లను తప్పనిసరిగా ధరించాలని…. అధికారుల సూచనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.