...
...
Next Story

AP Municipal Elections : పురపాలక ఎన్నికల్లో 'కూటమి' జోరు - 17 చోట్ల ఏకగ్రీవం..! రాయలసీమలో హవా..! లిస్ట్ ఇదే

AP Municipal Elections : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ఏకగ్రీవ విజయాలతో బోణీ కొట్టింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి 17 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను కూటమి ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.

Published on: Oct 26, 2026, 10:53:10 IST
Advertisement

AP Municipal Elections : పట్టణ స్థానిక సంస్థల (ULB) ఎన్నికల్లో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన ఆదివారం రాత్రి నాటికి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు గాను 17 స్థానాలను కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అధికారికంగా ప్రకటించింది.

కూటమి జోరు
కూటమి జోరు

కొందరు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారంటూ దాఖలైన ఫిర్యాదులపై విచారణ జరిపిన అత్యున్నత నాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పోలింగ్ షెడ్యూల్‌ను సవరించింది. అక్టోబర్ 18తో నామినేషన్ల గడువు ముగియాల్సి ఉండగా…. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై దాడులు జరిగాయన్న విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు, 24 గంటల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీని ఆదేశించింది.

19 మున్సిపాలిటీల పరిధిలో తమ అభ్యర్థులపై ఇనుప రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడులు చేసి, పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలను లాక్కొని చింపేశారని, 87 ప్రాంతాల్లో అభ్యర్థులను అడ్డుకున్నారని వైఎస్సార్సీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్….. వైఎస్సార్ కడప జిల్లాలోని కడప మున్సిపల్ కార్పొరేషన్, రాజంపేట, మైదుకూరు మున్సిపాలిటీలతో పాటు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో నామినేషన్ల సమర్పణకు అదనంగా 48 గంటల సమయం కల్పించింది.

ఈ మార్పుల అనంతరం, 13 మున్సిపల్ కార్పొరేషన్లతో సహా మొత్తం 100 పురపాలక సంస్థలకు నవంబర్ 1న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపడుతున్నట్లు ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

17 చోట్ల ఏకగ్రీవం…. కూటమి హవా

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా భావించే రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో కూటమి ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవమైన పురపాలక సంఘాల్లో అత్యధికంగా రాయలసీమ పరిధిలోనే 11 స్థానాలు ఉండటం విశేషం. ఆ తర్వాత పల్నాడు జిల్లాలో 3, పాత ప్రకాశం జిల్లా పరిధిలో 2 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

ఏకగ్రీవంగా గెలుచుకున్న మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు:

  • పుంగనూరు, రాయచోటి, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం, అల్లాగడ్డ, పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాల, ఆత్మకూరు, గుత్తి మరియు కనిగిరి స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.
  • దర్శి నగర పంచాయతీ అధ్యక్ష పదవిని జనసేన పార్టీ దక్కించుకుంది.
  • ఎర్రగుంట్ల నగర పంచాయతీ అధ్యక్ష స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.

మాజీ సీఎం సొంత జిల్లా అయిన వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ నేతృత్వంలోని కూటమి నాలుగు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలలో అధ్యక్ష పదవులన్నింటినీ ఏకగ్రీవంగా సొంతం చేసుకుంది. రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, కమలాపురం స్థానాలను టీడీపీ దక్కించుకోగా, ఎర్రగుంట్లను బీజేపీ ఖాతాలో వేసుకుంది.

వార్డుల వారీగా ఏకగ్రీవాల వివరాలు:

  • రాజంపేట : మొత్తం 32 వార్డులకు గాను 14 వార్డుల్లో టీడీపీ, 1 వార్డులో జనసేన అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.
  • ప్రొద్దుటూరు : 52 వార్డుల్లో టీడీపీ ఏకంగా 51 వార్డులను దక్కించుకోగా, మిగిలిన ఒక్క వార్డును బీజేపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.
  • బద్వేల్ : 40 వార్డుల్లో టీడీపీ 35, జనసేన 2 స్థానాలను ఏకగ్రీవం చేసుకోగా, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు.
  • మైదుకూరు : 32 వార్డుల్లో 17 వార్డులను టీడీపీ ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన 15 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
  • కమలాపురం : 23 వార్డులు ఉన్న ఈ నగర పంచాయతీలో టీడీపీ 22, బీజేపీ 1 వార్డును గెలుచుకున్నాయి.
  • ఎర్రగుంట్ల : 28 వార్డుల్లో టీడీపీ 17, బీజేపీ 10 స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నాయి.
  • పులివెందుల : వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల మున్సిపాలిటీలోని 40 వార్డులకు గాను టీడీపీ 19, బీజేపీ 1 స్థానాన్ని ఏకగ్రీవం చేసుకున్నాయి. మిగిలిన 20 వార్డులతో పాటు ఛైర్మన్ పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు.

కార్పొరేషన్లలోనూ అదే జోరు…

  • కడప కార్పొరేషన్ : మొత్తం 66 డివిజన్లు ఉండగా, టీడీపీ 47 డివిజన్లను, బీజేపీ 2, జనసేన 1 డివిజన్‌ను ఏకగ్రీవం చేసుకున్నాయి. మేయర్ పదవితో పాటు మిగిలిన 16 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
  • చిత్తూరు కార్పొరేషన్ : 60 డివిజన్లకు గాను 48 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జనసేన, బీజేపీ, వైఎస్సార్సీపీలు తలో డివిజన్‌ను దక్కించుకున్నాయి.
  • తిరుపతి కార్పొరేషన్ : 66 డివిజన్లలో టీడీపీ రెండు చోట్ల ఏకగ్రీవ విజయం సాధించింది.

ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఏకగ్రీవాలు నమోదు కాలేదు. పాత గోదావరి జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థులు పరిమిత సంఖ్యలో ఏకగ్రీవ విజయాలు సాధించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks