2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డుస్థాయిలో విక్రయించబడ్డాయి. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
లెక్కలిలా…!

గత ఏడాది 12.15 కోట్ల లడ్డూలను విక్రయించగా ఈ ఏడాది 13.52 కోట్ల లడ్డూలను టీటీడీ భక్తులకు విక్రయించింది. అంటే గత ఏడాదితో పోల్చితే 1.37 కోట్ల లడ్డూలను ఈ ఏడాది అదనంగా భక్తులకు విక్రయించడం జరిగింది.
గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా 2025 డిసెంబర్ 27వ తేదిన అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక విక్రయం.
టీటీడీ గత సంవత్సరంగా ప్రతిరోజూ 4 లక్షల వరకూ లడ్డూలను తయారు చేస్తోంది. ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు భక్తులకు అందుబాటులో ఉంచుతోంది.
700 మంది శ్రీవైష్ణవ బ్రహ్మణులు శ్రీవారి పోటులో రెండు షిప్టుల్లో 24 గంటలు శ్రమిస్తూ నియమ, నిష్టలతో స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తారు. ఇటీవల కాలంలో లడ్డూల నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు:
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనాలు సాగుతున్నాయి. మొదటి 3 రోజులు ఈ-డిప్ దర్శన టోకెన్లు కలిగిన భక్తులను అనుమతించారు. ఇప్పటివరకు 1,77,337 మంది వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ-డిప్ టోకెన్లు పొందిన భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులను శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు.