కృష్ణానది నీటిలోకి సంగమేశ్వరాలయం.. శివయ్యకు ప్రత్యేక పూజలు!

కృష్ణా నదిలో ఉండే సంగమేశ్వర ఆలయం నీటిలోకి వెళ్లింది. శ్రీశైలం బ్యాక్‌వాటర్ వచ్చి చేరుతోంది. శివయ్యకు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.

Published on: Aug 2, 2026, 15:35:52 IST
By , Nandyala
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండటంతో కృష్ణానది బ్యాక్‌వాటర్ ఉద్ధృతి పెరిగింది. దీని ప్రభావంతో నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సంగమేశ్వరాలయం మరోసారి నీట మునిగింది. జలాశయంలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుండటంతో ఆలయ ప్రాంగణాన్ని కృష్ణానది జలాలు పూర్తిగా చుట్టుముట్టాయి.

సంగమేశ్వరాలయం
సంగమేశ్వరాలయం

ఆలయం చుట్టూ నీరు చేరుకుంటున్న తరుణంలో అర్చకులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ నది తల్లిని శాంతింపజేసేలా గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, చీరెసారె సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. నది దేవత ఆశీస్సుల కోసం వేడుకుంటూ విశేష పూజాధికాలు నిర్వహించారు. కృష్ణమ్మ ప్రవాహం మరింత ఉద్ధృతంగా మారుతుండటంతో, వేపదారు శివలింగం రాబోయే కొన్ని రోజుల పాటు పూర్తిగా నీటిలోనే ఉండే అవకాశం ఉందని పూజారులు వెల్లడించారు. దీంతో శివయ్యకు ప్రత్యేక పూజలు చేశారు.

కృష్ణా, తుంగభద్ర తదితర నదుల సంగమ ప్రాంతంలో వెలసిన ఈ సంగమేశ్వరాలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏటా వర్షాకాలంలో శ్రీశైలం రిజర్వాయర్ నిండే కొద్దీ ఈ ఆలయం నీట మునిగిపోవడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన ప్రతిసారీ ఈ ఆలయం పూర్తిగా జలమగ్నం కావడం వల్ల, ఏటా కొన్ని నెలల పాటు భక్తులకు గర్భాలయంలోని శివలింగ దర్శనం లభించదు. అయినప్పటికీ ఈ దృశ్యాన్ని తిలకించడానికి, నది మధ్యలో ఆలయం మునిగిపోతున్న వైవిధ్యాన్ని వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రకృతి ప్రేమికులు, భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.

ఆలయం నీట మునిగిపోవడంతో ప్రస్తుతం గర్భాలయంలోకి ఎవరినీ అనుమతించడం లేదు. నీటి ఉద్ధృతి ప్రమాదకరంగా మారుతున్నందున నదిలోకి దిగవద్దని అధికారులు స్థానిక ప్రజలను, పర్యాటకులను హెచ్చరించారు. శ్రీశైలం జలాశయ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నందున, రానున్న రోజుల్లో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నంద్యాల జిల్లా యంత్రాంగం తగిన భద్రతా చర్యలు చేపట్టింది. నది ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గత సంవత్సరం జూన్ 15వ తేదీన సంగమేశ్వర స్వామి ఆలయంలోకి నీరు ప్రవేశించింది. ఈ ఏడాది ఆగస్టు 1న నీరు వచ్చిందని ఆలయ అర్చకులు వెల్లడించారు. గతేడాది జూన్ 15వ తేదీన స్వామివారు జలాధివాసం కాగా.. తిరిగి మార్చి నెలలో నీరు తగ్గి ఆలయం బయటపడింది. దీంతో భక్తులు సంగమేశ్వర ఆలయం వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మార్చి నెల నుంచి ఆగస్టు వరకు సుమారు 131 రోజులు స్వామివారు పూజలు అందుకున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More