కోడి పందేలకు ఓ పద్ధతి, ప్లానింగ్.. కానీ ఈసారి అవసరమైతే 144 సెక్షన్!

సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేలు నిర్వహించడం అనేక ఏళ్లుగా వస్తుంది. మరోవైపు కోడి పందేల నిర్వహణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Published on: Jan 11, 2026, 15:09:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి వేడుకలు అనగానే వెంటనే గుర్తొచ్చేది కోడిపందేలు. ఈ సంప్రదాయం ప్రతి సంవత్సరం అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. పొరుగు రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా విదేశాలలో స్థిరపడిన వారు కూడా ఈ పోటీలను చూడటానికి పండుగ సమయంలో తమ స్వగ్రామాలకు తిరిగి వస్తారు. కోడిని జాగ్రత్తగా సెలక్ట్ చేసుకోవడం, ప్రత్యేక శిక్షణ ఇవ్వడం నుండి కఠినమైన ఆహారం, ఫైట్ వరకు.. కోడి జీవితంలోని ప్రతి అంశాన్ని పద్ధతి, ప్లానింగ్ ప్రకారం చూస్తారు.

కోడి పందేలు
కోడి పందేలు

ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాలు ముఖ్యంగా కోడి పందేలకు ప్రధాన కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇది సంక్రాంతి పండుగ సమయంలో సాంప్రదాయ గ్రామీణ క్రీడగా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు సంక్రాంతి పండుగ రోజుల్లో కోట్ల రూపాయల పందేలతో కూడిన పెద్ద ఎత్తున జూదంగా మారింది. ఇదే అసలు సమస్యగా మారింది.

బెస్ట్ ట్రైనర్స్

కోళ్ల యజమానులు మంచి బ్రాండ్ విలువ కలిగిన శిక్షకులను కోరుకుంటారు. గతంలో గెలిచిన కోడిపిల్లలకు శిక్షణ ఇచ్చిన వారిని, శిక్షకులుగా తరతరాలుగా ఉన్న కుటుంబాలకు బాధ్యత అప్పజెప్పుతారు. కొంతమంది యజమానులు హైదరాబాద్‌లోని బార్కాస్ ప్రాంతం నుండి శిక్షణ పొందిన కోడిపిల్లలను తీసుకువస్తారు. మరికొందరు కోల్‌కతా వంటి ప్రదేశాల నుండి నిపుణులను పిలిపిస్తారు.

సాధారణంగా ఒక శిక్షకుడు 10 నుండి 15 కోడిపిల్లలను మాత్రమే పర్యవేక్షిస్తాడు. నెలకు రూ.15,000 నుండి రూ.20,000 వరకు జీతం పొందుతారని సమాచారం. శిక్షణ సాధారణంగా దసరా నుంచి ప్రారంభమవుతుంది. అయితే కొందరు స్వల్పకాలిక, సంవత్సరం పొడవునా శిక్షణా కార్యక్రమాలు కూడా ఇస్తారు.

కోళ్లకు షెడ్యూల్

ఫైటింగ్ కోడి రోజూవారి షెడ్యూల్ ఉంటుంది. శిక్షణ ఉదయం 5 గంటల నుండే ప్రారంభమవుతుంది. ఫైట్‌కు 60 రోజుల ముందు వరకు డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, హెర్బల్ మిక్స్‌లు, వండిన ఆకుకూరలు వంటి ప్రత్యేక ఆహారాలను అందిస్తారు. పోటీకి దాదాపు 40 రోజుల ముందు గుడ్డులోని తెల్లసొనను ఆహారంలో కలుపుతారు. పందెం కోళ్లకు చాలా గంటలు ఆరుబయట వ్యాయామం చేయిస్తారు. సాయంత్రం ధాన్యపు ఆహారం ఇస్తారు. ఎక్కువసేపు విశ్రాంతి ఇస్తారు. భయాన్ని తొలగించడానికి, చురుకుదనాన్ని మెరుగుపరచడానికి చేతితో ఆహారం పెడతారు. అప్పుడప్పుడు ఈత కూడా కొట్టిస్తారు.

సంక్రాంతికి ముందు రెస్ట్

సంక్రాంతికి ఒక వారం ముందు మంచి పనితీరు కోసం పూర్తి విశ్రాంతి ఇస్తారు. అలసటను తగ్గించడానికి, బరువును నియంత్రించడానికి, ఇన్ఫెక్షన్లు, ఫంగల్ వ్యాధులు వంటి కాలానుగుణ వ్యాధుల నుండి పక్షులను రక్షించడానికి విటమిన్లు, సప్లిమెంట్లు, యాంటీబయాటిక్స్ కూడా సాధారణంగా ఉపయోగిస్తారు. మూలికా స్నానాలు, ఆవిరి చికిత్స వంటి ప్రత్యేక చికిత్సలు కోళ్ల శరీరాలను దృఢంగా చేస్తాయని నమ్ముతారు. తద్వారా అవి ఫైటింగ్ సమయంలో గాయాలను తట్టుకోగలవు, దూకుడుగా ఉంటాయి.

చాలా ప్రాంతాలు పక్షుల కాళ్లకు కట్టిన కత్తులను ఉపయోగిస్తుండగా.. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు కత్తులు లేని పోటీలను నిర్వహిస్తాయి. ఇక్కడ కోళ్లకు సహజంగా పెరిగిన ముల్లును పదును పెట్టి ఆయుధంగా ఉపయోగిస్తారు.

హైకోర్టు సీరియస్

మరోవైపు కోడిపందేలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోడి పందేలు నిర్వహించే వారిపై జంతు హింస నిరోధక చట్టం 1960, ఏపీ జూద నిరోధక చట్టాలనుకఠినంగా అమలు చేయాలని హైకోర్టు.. కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో సభలు నిర్వహించాలని, చట్ట నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపింది. కోడి పందేల బరుల దగ్గర కోడి కత్తులు, ఇతర పందెం సామగ్రి, సొమ్మును వెంటనే స్వాధీనం చేసుకోవాలని తెలిపింది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని కోర్టు పేర్కొంది.

ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే.. వ్యక్తిగతంగా అధికారులే బాధ్యత వహించాలని హైకోర్టు తెలిపింది. కోడి పందేల గురించి తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలని, ఇందులో తహసీల్దార్, ఎస్సై ర్యాంకుకు తగ్గని పోలీసు అధికారి, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సభ్యులుగా ఉండాలని చెప్పింది. తనిఖీలకు వెళ్లే సమయంలో ఇద్దరు పోలీసులు, ఒక ఫొటోగ్రాఫర్ సహాయకులుగా ఉండాలని ఆదేశించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More