హైదరాబాద్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. గుంటూరు వెళ్తుండగా ఘటన!

తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

Published on: Oct 25, 2025, 15:04:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కర్నూలు బస్సు ప్రమాదం మరవకముందే వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. అయితే మరోవైపు తాజాగా మరో ఘటన హైదరాబాద్‌లో జరిగింది. హైదరాబాద్‌ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.

ఓఆర్ఆర్‌పై బస్సు బోల్తా
ఓఆర్ఆర్‌పై బస్సు బోల్తా

బస్సులో 15 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం జరగలేదని పోలీసులు తెలిపారు. పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ దగ్గర అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది బస్సు. డ్రైవర్ తప్పిదం వల్లనే ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.

సంగారెడ్డిలో తప్పిన ప్రమాదం

ఇంకోవైపు సంగారెడ్డి జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. సదాశివపేటలో శనివారం ఉదయం స్కూల్ బస్సు వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ తీగలు దానిపై తెగిపడ్డాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. బస్సును ఆపకుండా వెంటనే ముందుకు వెళ్లనిచ్చాడు డ్రైవర్. ఆ సమయంలో 25 మంది విద్యార్థులు బస్సులో ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

అధికారుల తనిఖీలు

కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత తెలంగాణ రవాణా శాఖ అప్రమత్తమైంది. బస్సులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏమైనా లోపాలు ఉన్నాయా అని తనిఖీ చేస్తున్నారు. విజయవాడ, బెంగళూరు హైవేపై ఆర్టీఏ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను పరిశీలిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ, మెడికల్ కిట్లను చెకింగ్ చేస్తూ.. నిబంధనలు పాటించని పలు ట్రావెల్స్ బస్సుల మీద కేసులు నమోదు చేశారు అధికారులు. బస్సు అద్దం పగిలి అలాగే ఉన్న ఓ బస్సును సీజ్ చేశారు.

శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు. బైకర్ మృతి చెందాడు. బస్సు బైక్‌ను ఈడ్చుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. బైక్ పెట్రోల్ లీక్ అయింది. దీంతో నిప్పు రవ్వలు చెలరేగి.. లగేజీ క్యాబిన్‌కు మంటలు అంటుకున్నాయి. మెల్లమెల్లగా బస్సు అంతటా మంటలు వ్యాపించాయి. లగేజీలో ఉన్న 200కు పైగా స్మార్ట్ ఫోన్లు పేలాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More