ప్రకాశం జిల్లాలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం.. ఆ తర్వాత కుర్చీలో కూర్చోబెట్టి..

ప్రకాశం జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి.. ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి.. హత్య చేశాడు. ఆపై కుర్చీలో కూర్చోబెట్టాడు.

Published on: Oct 26, 2026, 15:51:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే విషాద సంఘటన వెలుగుచూసింది. నాగులుప్పలపాడు మండల కేంద్రంలో ఆరేళ్ల పసిపాపపై ఒక కామాంధుడు అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడిగట్టి, అనంతరం ఊపిరి తీసి దారుణంగా హత్య చేశాడు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా.. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు, బాధిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు.

బాలికపై హత్యాచారం
బాలికపై హత్యాచారం

బాధిత చిన్నారి తల్లిదండ్రులు పొట్టకూటి కోసం హైదరాబాద్‌కు వెళ్లి బేల్దారి పనులు చేసుకుంటున్నారు. పాపను గ్రామంలోని అమ్మమ్మ సంరక్షణలో ఉంచారు. ఆదివారం రాత్రి వేళ చిన్నారి ఇంటి ఆరుబయట నిద్రిస్తుండగా, అదే కాలనీకి చెందిన ఆనంద్ అనే వ్యక్తి ఆమెను ఎత్తుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం పాప కేకలు వేయకుండా దారుణంగా హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని తెచ్చి ఇంటి వద్ద ఉన్న ఒక కుర్చీలో కూర్చోబెట్టి అక్కడ నుంచి పారిపోయేందుకు యత్నించాడు.

పాప పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. పారిపోతున్న నిందితుడు ఆనంద్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులకు అక్కడికి చేరుకోగా అప్పగించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

ఈ దారుణ ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తమకు అప్పగించాలని, అతనికి తక్షణమే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హైవేపై ధర్నాకు దిగారు. రహదారిపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. భవిష్యత్తులో ఏ చిన్నారికి కూడా ఇలాంటి అన్యాయం జరగకూడదని, కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారించి కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు.

ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది సమాజం తలదించుకోవాల్సిన దారుణమైన చర్య అని వ్యాఖ్యానించారు. ఈ కేసుకు సంబంధించి సమగ్రమైన విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

చిన్నారి కుటుంబానికి చట్టపరంగా, మానవతా కోణంలో తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. నాగులుప్పలపాడుకు స్వయంగా బయలుదేరి వెళ్లిన ఛైర్‌పర్సన్, బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More