సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ప్రభుత్వం నుంచి డబ్బులు.. ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం పథకాలను జనాల్లోకి తీసుకెళ్తే పారితోషికం అందించనుంది. అయితే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పారిశ్రామికాభివృద్ధిని సమతుల్యం చేస్తూ పలు కీలక నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత వేగంగా చేరవేయడం, పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలోకి సమర్థవంతంగా చేరుకోవాలనే ఉద్దేశంతో డిజిటల్ మాధ్యమాలను వినియోగించుకోవాలని సర్కార్ భావించింది. అందులో భాగంగా సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యేక విధానాన్ని ఖరారు చేసింది.
ఈ విధానం కింద అర్హులైన, విశ్వసనీయమైన డిజిటల్ క్రియేటర్లను గుర్తించి పబ్లిక్ రిలేషన్స్ కేటగిరీ కింద ఎన్‌రోల్ చేస్తారు. ప్రతి క్రియేటర్ ఫాలోవర్ల సంఖ్య, వారు చేసే వీడియోల రీచ్ ఆధారంగా వివిధ విభాగాలుగా వర్గీకరించి పారితోషికం చెల్లిస్తారు. అయితే వారికి ఓ ఐడీ కార్డులాంటిది ఇచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
ఫాలోవర్ల సంఖ్య లక్షకుపైగా ఉంటే.. ప్రతీ వీడియోకి రూ. 15,000 ఇస్తారు.
50,000 నుండి 99,999 వరకు ఫాలోవర్లు ఉంటే.. రూ.7,500.
25,000 నుండి 49,999 వరకు ఫాలోవర్లు ఉంటే.. రూ.5,000.
10,000 నుండి 24,999 వరకు ఫాలోవర్లు ఉంటే రూ.2,500.
క్రియేటర్లు చేసే ప్రతి వీడియో ప్రచారానికి ప్రభుత్వం విధించిన నిర్దిష్ట నిబంధనలు, షరతులు వర్తిస్తాయి. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఒక క్రియేటర్‌కు నెలకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల మేరకే పరిమితి విధించారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో డిజిటల్ వేదికలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయి పోటీ నెలకొంది. ఈ క్రమంలో ప్రతిపక్ష సోషల్ మీడియా దాడిని ఎదుర్కొంటూనే, ప్రభుత్వం వైపు నుండి సానుకూల దృక్పథాన్ని నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం ఈ వ్యూహాన్ని ఎంచుకుంది.
చిన్న స్థాయి డిజిటల్ క్రియేటర్లకు, స్థానిక యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్లకు క్రమం తప్పకుండా ఆదాయ మార్గం లభిస్తుంది. ప్రభుత్వ పథకాలను సాంకేతిక భాషలో కాకుండా, సామాన్యుడికి అర్థమయ్యే సృజనాత్మక రీతిలో రీల్స్, వీడియోల ద్వారా రీచ్ పెంచడం సాధ్యమవుతుంది.
మరోవైపు తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా మచిలీపట్నంలో గోవా షిప్‌బిల్డింగ్ యూనిట్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఓడల నిర్మాణం, మరమ్మతుల రంగంలో ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ఏర్పాటు ద్వారా కృష్ణా జిల్లా వ్యాప్తంగా పారిశ్రామిక ప్రగతి వేగం పుంజుకోనుంది. ఈ పరిశ్రమ రాకతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల సంఖ్యలో ఇంజనీరింగ్, సాంకేతిక మరియు నైపుణ్యం కలిగిన యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


