Rajahmundry - Kakinada MEMU Train : ఏపీలోని రాజమండ్రి, కాకినాడ వాసులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది.పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు, డిమాండ్ నేపథ్యంలో ఈ రెండు కీలక నగరాల మధ్య కొత్త మెమూ రైలు సర్వీస్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త రైలు ప్రారంభ తేదీ, షెడ్యూల్, స్టాప్ లు, ఇతర వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

రాజమండ్రి - కాకినాడ మధ్య పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సర్వీస్ వల్ల కేవలం తక్కువ ఛార్జీతో ప్రయాణించడమే కాకుండా… రోడ్డు మార్గంలో ఉండే ట్రాఫిక్ చిక్కుల నుంచి కూడా ప్రయాణికులకు విముక్తి లభించనుంది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం…. రైలు నంబర్ 67301 మెమూ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ ఉదయం 06:15 నిమిషాలకు కాకినాడ పోర్ట్ నుండి బయలుదేరుతుంది. ఉదయం 08:15 నిమిషాలకు రాజమండ్రి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 67302 మధ్యాహ్నం 15:00 గంటలకు రాజమండ్రిలో బయలుదేరి సాయంత్రం 04:40 నిమిషాలకు కాకినాడ పోర్ట్ చేరుకుంటుంది. ఈ సర్వీసులు ఈనెల 27, 28 తేదీల నుంచి ప్రారంభమవుతాయి.
ఆగే స్టేషన్లు…
- కాకినాడ టౌన్
- సామర్లకోట
- మేడపాడు
- బిక్కవోలు
- అనపర్తి
- ద్వారపూడి
ఈ రైళ్లు ప్రధానంగా ఉదయం కాకినాడ నుంచి రాజమండ్రి బయలుదేరి వెళ్లే వారికి, అలాగే రాత్రి వరకూ పనులు ముగించుకుని తిరిగి వచ్చే కార్మికులతో పాటు ఇతరులకు ఎంతో ఉపయోగపడనుంది. ఇక ఈ మెమూ రైలు ప్రారంభం కావడంతో జిల్లాలోని అంతర్గత ప్రాంతాలతో పాటు ప్రధాన నగరాలకు మధ్య అనుసంధానం మరింత పెరగనుంది. ముఖ్యంగా ఆఫీసు వేళలకు అనుగుణంగా ఈ రైలు సమయాలు ఉండటం వల్ల మధ్యతరగతి ప్రయాణికులకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుంది.