దక్షిణ మధ్య రైల్వే కుదింపు - త్వరలోనే విశాఖ రైల్వే జోన్...!
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే కార్యకలాపాలను ప్రారంభించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు, విశాఖపట్నం(కొత్త డివిజన్) డివిజన్లు ఉంటాయి.
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే కార్యకలాపాలను ప్రారంభించే దిశగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే అపాయింటెడ్ డేను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేసే కొత్త రైల్వే జోన్ లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లతో పాటు కొత్తగా ఏర్పాటు కాబోయే విశాఖపట్నం(కొత్త డివిజన్) డివిజన్లు ఉంటాయి. కొత్త రైల్వే జోన్ అమల్లోకి వస్తే…. ప్రస్తుతం 6 డివిజన్లతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో కొన్ని తగ్గిపోతాయి. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్‌లకే పరిమితమవుతుంది.
ఇప్పటికే కొత్త జోన్‌కు సంబంధించిన కీలకమైన నియామకాలను బోర్డు దశలవారీగా పూర్తి చేస్తోంది. పునర్విభజనలో భాగంగా కొన్ని మార్పులు వస్తాయి. గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు - వాడి మధ్య 108 కిలోమీటర్ల రైలు మార్గం ఇకపై సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం గుంటూరు డివిజన్‌లో ఉన్న విష్ణుపురం-పగిడిపల్లి,విష్ణుపురం-జాన్‌పహాడ్ మార్గాలు కలిపి మొత్తం 142 కిలోమీటర్లు సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ కానున్నాయి.
మోటుమర్రి-కొండపల్లి రైలు మార్గం(46 కిలోమీటర్ల) సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది.
ఈ నెలాఖరుకల్లా కొత్త రైల్వే జోన్ అపాయింటెడ్ డేపై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. డివిజన్ల వారీగా విభజన, సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై కూడా అధికారికంగా ప్రకటన వస్తే… మరింత స్పష్టత రానుంది.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రైల్వే జోన్. 2019 ఫిబ్రవరి 27వ తేదీన విశాఖ వేదికగా ఈ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఏపీకి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. అందులో భాగంగా విశాఖపట్నం వేదికగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ కొత్త జోన్‌లో దక్షిణ మధ్య రైల్వేలో ఉన్న గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్‌లో సగాన్ని విలీనం చేసింది.
విజయవాడ డివిజన్‌లో 959 కి.మీ.లు, గుంతకల్లు డివిజన్‌లో 1,354 కి.మీ.లు, గుంటూరు డివిజన్‌లో 628 కి.మీ.లు మొత్తం కలిపి 2,931 కి.మీ. పరిధి ఉంది. ఇక వాల్తేరు డివిజన్ పరిధి 1,106 కి.మీ లోని సగం 600 కి.మీలు కొత్త జోన్‌లో కలపనున్నారు. మొత్తంగా సౌత్ కోస్టు రైల్వే జోన్ పరిధి 3,500 కి.మీల వరకు ఉండనుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

