శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు - పంచమఠాల్లో ఆర్జిత అభిషేకాలు, రూ.216కే టికెట్!

Srisailam Panchamathalu Abhishekam : కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం పంచమఠాల్లో భక్తుల కోసం ఆర్జిత అభిషేకాలను అందుబాటులోకి తెచ్చారు. రూ. 216 రుసుముతో వాట్సాప్, ఆన్‌లైన్ ద్వారా టికెట్లు పొందవచ్చని అధికారులు తెలిపారు.

Published on: Oct 28, 2026, 12:07:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Srisailam Panchamathalu Abhishekam : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో పవిత్ర కార్తిక మాసోత్సవాలకు దేవస్థానం సర్వం సిద్ధం చేస్తోంది. నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ పవిత్ర రోజుల్లో శ్రీశైలానికి విచ్చేసే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎమ్. శ్రీనివాసరావు కీలక నిర్ణయాలను వెల్లడించారు.

శ్రీశైలం
శ్రీశైలం

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు కార్తీక మాసంలో ప్రధానాలయంలో నిర్వహించే శ్రీస్వామివారి గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను నిలిపివేశారు. అయితే…. పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో అభిషేకం జరిపించుకోవాలని భావించే భక్తుల కోసం ప్రత్యేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా శ్రీశైలంలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న పంచమఠాల్లో ఆర్జిత అభిషేకాలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించారు.

రూ. 216 రుసుంతో….

సామాన్య భక్తులు సైతం సులభంగా స్వామివారికి అభిషేకం చేసుకునేందుకు వీలుగా ఈ సేవా రుసుమును కేవలం రూ. 216గా నిర్ణయించారు. ఒక్క టికెట్‌పై దంపతులను గానీ లేదా ఒక వ్యక్తిని గానీ అభిషేకానికి అనుమతిస్తారు. భక్తులు తమ సౌకర్యం కోసం ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు డిజిటల్ విధానాలను అందుబాటులోకి తెచ్చారు. ‘మనమిత్ర’ వాట్సాప్‌ నంబర్ 9552300009 ద్వారా కానీ, ఏపీటీఎస్ వారి అధికారిక వెబ్‌సైట్ www.tms.ap.gov.in ద్వారా కానీ ఈ ఆర్జిత అభిషేక టికెట్లను సులభంగా పొందవచ్చు.

శ్రీశైల క్షేత్రంలో ఎంతో ప్రాశస్త్యం పొందిన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధరమఠం అనే పంచమఠాల్లో భక్తులు తమ అభీష్టం మేరకు ఏదైనా ఒక మఠాన్ని ఎంచుకుని ఈ ఆర్జిత అభిషేకాన్ని జరిపించుకోవచ్చని అధికారులు తెలిపారు.

శ్రీశైల చరిత్రలో పంచమఠాల విశిష్టత

శ్రీశైల ఆధ్యాత్మిక సంస్కృతి, వారసత్వంలో ఈ పంచమఠాలు శతాబ్దాలుగా ఎంతో ప్రధాన పాత్ర పోషించాయని ఈఓ శ్రీనివాసరావు, పాలకమండలి అధ్యక్షుడు రమేష్‌నాయుడు వివరించారు. ఇవి వ్యవహారంలో మఠాలుగా పిలువబడుతున్నప్పటికీ…. సాధారణ ఆలయాల మాదిరిగానే గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం వంటి పూర్తి ఆధ్యాత్మిక నిర్మాణ శైలిని కలిగి ఉండటం వీటి ప్రత్యేకత.

గత కొన్ని శతాబ్దాలుగా శ్రీశైల క్షేత్ర ప్రశాంతతను కాపాడటంలో, ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించడంలో, క్షేత్ర నిర్వహణలో ఈ మఠాలు ప్రముఖ భూమిక వహించాయి. ముఖ్యంగా ఈ పంచమఠాలు అత్యుత్తమ ధ్యానకేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. కాబట్టి, దేవస్థానం కల్పించిన ఈ అద్భుత అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని, పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరుని కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More