తిరుమలలో వైభవోపేతంగా శ్రీవారి చక్రస్నానం.. పుష్కరిణిలో వేలాది మంది భక్తుల పుణ్యస్నానాలు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చక్రస్నానం వైభవోపేతంగా జరిగింది. పుష్కరిణిలో వేలాది మంది భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు ఘట్టమైన చక్రస్నానం మంగళవారం ఉదయం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వామివారి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించగా, వేలాది మంది భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.

చక్రస్నానానికి ముందు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్వామివారికి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. వైఖానస ఆగమోక్తంగా నిర్వహించిన ఈ పవిత్ర క్రతువులో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలను ఉపయోగించారు. టీటీడీ వేదపారాయణదారులు ఉపనిషత్తు మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర వేదమంత్రాలను పఠించారు.
అనంతరం తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి పాశురాలను పఠించారు. స్వామివారికి, అమ్మవార్లకు విశిష్టమైన పుష్పమాలలను అలంకరించారు. తొమ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలకు చక్రస్నానం సంపూర్ణతను చేకూర్చే పవిత్ర ఘట్టం. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని, సకల జీవరాశులకు శుభం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ అవభృథ స్నానాన్ని నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాలను మహాయజ్ఞంతో సమానంగా భావిస్తారు. యజ్ఞం ముగింపులో నిర్వహించే అవభృథ స్నానం మాదిరిగానే, బ్రహ్మోత్సవాల ముగింపులో చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాల ద్వారా సమస్త లోకానికి శుభం కలగాలని, క్రతువుల సంపూర్ణ ఫలాలు లభించాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తారు.
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించిన అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లను పవిత్ర పుష్కరిణి జలాల్లో ముంచి చక్రస్నానం చేయించారు. అదే సమయంలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ దివ్య ఘట్టాన్ని దర్శించినవారికి, బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నవారికి స్వామివారి అనుగ్రహంతో పాటు ఉత్సవ యజ్ఞఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
భక్తిభావం, వేదమంత్రాల నడుమ జరిగిన చక్రస్నానంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్. వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, డాలర్ దివాకర్ రెడ్డి, నరేష్ కుమార్, నన్నపనేని సదాశివరావు, జాస్తి పూర్ణ సాంబశివరావు, ఆనంద్ సాయి, జేఈవో (హెచ్ అండ్ ఈ) గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


