ఆస్తిపై కక్కుర్తితో పిల్లలకు బిర్యానీలో ఎలుకల మందు కలిపి చంపిన సవతి తల్లి

ఆస్తిపై కక్కుర్తితో ఓ సవతి తల్లి దారుణం చేసింది. ఇద్దరు చిన్నారులకు బిర్యాలనీలో ఎలుకల మందు పెట్టి చంపేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

Published on: Oct 30, 2026, 11:53:25 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో ఆస్తి వ్యామోహానికి, సవతి తల్లి కక్షసాధింపునకు ఇద్దరు చిన్నారులు బలైపోయారు. ఎంతో ఇష్టంగా తింటారనే నెపంతో, చికెన్ బిర్యానీలో ఎలుకల మందు కలిపి ఇచ్చి, నమ్మించి గొంతు కోసింది ఆ కిరాతకురాలు. కలుషిత ఆహారం తిని చనిపోయారంటూ నిందితులు అల్లిన కల్లబొల్లి కథలను ఛేదించి, కొత్తపేట పోలీసులు అసలు నిజాన్ని వెలుగులోకి తెచ్చారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

పోలీసు వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా బ్రాహ్మణకోడూరుకు చెందిన స్వర్ణ, నెహ్రూనగర్ నివాసి రాంబాబులు 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి సాత్విక్ (10), నిత్య (8) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబంలో నెలకొన్న కలహాల కారణంగా 2022లో స్వర్ణ ఆత్మహత్య చేసుకుంది. రాంబాబు మేరీ అనే మహిళను రెండో పెళ్లి చేసుకోవడంతో చిన్నారుల జీవితాల్లోకి పెద్ద తుపాను వచ్చిపడింది. తల్లి లేని లోటు తెలిసిరాకుండా పెరగాల్సిన ఆ చిన్నారుల జీవితం మరో మలుపు తిరిగింది.

మేరీకి ఇదివరకే వివాహమై ఒక కుమారుడు ఉన్నాడు. రెండో భార్యగా ఇంట్లోకి వచ్చిన నాటి నుంచి సాత్విక్, నిత్యలను ఆమె కంటిపాపలా చూడకపోగా, తీవ్ర వేధింపులకు గురిచేసేది. రాంబాబు ఆస్తి అంతా మొదటి భార్య పిల్లలకే చెందుతుందేమోనన్న భయంతో, ఆ పసివారిని ఇల్లు విడిచి వెళ్లిపోవాలని బెదిరించేది.

పిల్లలను శాశ్వతంగా వదిలించుకోవాలని కుట్ర పన్నిన మేరీ.. ఈ నెల 20వ తేదీన ఎంతో ఇష్టంగా తినే చికెన్ బిర్యానీలో ఎలుకల మందు కలిపి తినిపించింది. అయితే తొలిరోజు పిల్లలకు ఏమీ కాకపోవడంతో మరుసటి రోజు కూడా కలిపి ఇచ్చేందుకు ప్లాన్ చేసింది.

ఈ క్రమంలో దసరా ఉత్సవాల్లో భోజనం తిన్న తర్వాత చిన్నారులు తీవ్రంగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. దీంతో అసలు విషయం బయటపడుతుందనే భయంతో మేరీ తన భర్త రాంబాబుకు విషయాన్ని చెప్పింది. ఆ తరవాత బాధ్యతాయుతంగా కాపాడాల్సిన తండ్రి కూడా భార్య క్రూరత్వానికి సహకరిస్తూ, పిల్లలు కలుషిత ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారంటూ ఆసుపత్రుల చుట్టూ తిప్పే నాటకానికి తెరతీశాడు.

తీవ్ర అస్వస్థతకు గురైన సాత్విక్, నిత్యలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 24న ప్రాణాలు విడిచారు. ఇద్దరు చిన్నారులు ఒకేసారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కొత్తపేట సీఐ వీరయ్యచౌదరి, ఎస్సై హనుమంతరావు రంగంలోకి దిగారు. చిన్నారుల మృతదేహాలను నిశితంగా పరిశీలించిన సీఐ, అది ఆహారం వికటించడం వల్ల జరిగింది కాదని, పక్కాగా విషప్రయోగమేనని అనుమానించారు.

సందేహంతో వెంటనే రాంబాబు నివాసంలో సోదాలు నిర్వహించగా, ఇంట్లో ఎలుకల మందు లభ్యమైంది. పోలీసుల శైలిలో విచారించడంతో మేరీ తన దారుణ కృత్యాన్ని, రాంబాబు దానికి సహకరించిన తీరును అంగీకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దారుణానికి ఒడిగట్టిన భార్యాభర్తలిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆస్తి కోసం పసివాళ్లను బలితీసుకున్న ఈ ఘాతుకం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More