ప్రోస్టేట్ వాపు, ప్రోస్టేట్ క్యాన్సర్‌కి తేడా ఏంటి? లక్షణాలు ఏంటి? చికిత్స ఎలా?
ప్రోస్టేట్ వాపు, ప్రోస్టేట్ క్యాన్సర్ల మధ్య తేడా తెలియక చాలా మంది భయపడిపోతూ ఉంటారు. వీటిల్లో ఏది ప్రమాదకరం? వీటి లక్షణాలు, రోగనిర్ధారణ పరీక్షలు, చికిత్స మార్గాలపై హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ ఎం. గోపిచంద్ కీలక విషయాలను తెలియజేశారు.
వయస్సు 50 దాటిన తర్వాత చాలా మంది పురుషులను వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మూత్రవిసర్జన ఇబ్బందులు ఒకటి. మూత్రం సరిగ్గా రాకపోవడం లేదా పదే పదే వెళ్లాల్సి రావడం వంటి సంకేతాలు కనిపించగానే చాలామంది తీవ్ర భయాందోళనలకు గురవుతుంటారు. ఇది ఏమైనా క్యాన్సర్ వ్యాధికి సంకేతమేమో అని కలవరపడుతుంటారు. అయితే, ప్రోస్టేట్ గ్రంధికి సంబంధించి వచ్చే సమస్యలన్నీ క్యాన్సర్ కావు! వీటిలో అత్యధిక కేసులు 'ప్రోస్టేట్ వాపు' (Benign Prostatic Hyperplasia - BPH)కి సంబంధించినవే ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రోస్టేట్ వాపుకు, ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఉన్న వ్యత్యాసాలు, లక్షణాలు, చికిత్సపై హైదరాబాద్ యశోద హాస్పిటల్‌కి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ ఎం. గోపిచంద్ పలు కీలక విషయాలను వెల్లడించారు. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాము..

బీపీహెచ్, క్యాన్సర్- రెండు వేర్వేరు సమస్యలు..
పురుషుల్లో మూత్రాశయం కింద భాగంలో చిన్న ఆక్రూట్ గింజ పరిమాణంలో ప్రోస్టేట్ గ్రంధి ఉంటుంది. ఇది వీర్య కణాలను మోసుకెళ్లే ద్రవాన్ని ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వయస్సు పెరిగే కొద్దీ ఈ గ్రంధి పరిమాణం పెరగడం సహజ ప్రక్రియ.
ప్రోస్టేట్ వాపు (బీపీహెచ్): ఇది సాధారణ కణజాలం పెరగడం వల్ల వచ్చే సమస్య. ఇది ప్రాణాంతకం కాదు. శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించదు.
ప్రోస్టేట్ క్యాన్సర్: ఇది ప్రోస్టేట్ గ్రంధిలో అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరగడం వల్ల వచ్చే వ్యాధి.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ప్రధాన విషయం.. బీపీహెచ్ అనేది క్యాన్సర్‌గా మారదు. అలాగే బీపీహెచ్ ఉండటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరగదు.
అయితే, వయస్సు పెరిగే కొద్దీ ఒకే వ్యక్తిలో ఈ రెండు సమస్యలు ఒకేసారి ఉండే అవకాశం ఉంది.
లక్షణాలు: ఒకేలా కనిపించే సంకేతాలు..
ఈ రెండు సమస్యల్లోనూ ప్రారంభంలో మూత్రవిసర్జనకు సంబంధించిన మార్పులే కనిపిస్తాయి:
- రాత్రివేళల్లో పదే పదే మూత్రవిసర్జనకు లేవాల్సి రావడం.
- మూత్రధార బలహీనంగా ఉండటం లేదా ఆగుతూ రావడం.
- మూత్రవిసర్జన ప్రారంభించడంలో ఇబ్బంది కలగడం.
- మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదనే భావన కలగడం.
ప్రోస్టేట్ గ్రంధి పరిమాణం పెరిగి మూత్రనాళంపై ఒత్తిడి తేవడం వల్ల బీపీహెచ్లో ఈ లక్షణాలు నెమ్మదిగా మొదలవుతాయి. అయితే, ప్రారంభ దశలో ఉన్న ప్రోస్టేట్ క్యాన్సర్‌లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యాధి ముదిరిన తర్వాత మూత్రంలో లేదా వీర్యంలో రక్తం పడటం, నడుము, తుంటి లేదా పొత్తికడుపు భాగంలో తీవ్రమైన నొప్పి, అంగస్తంభన సమస్యలు, ఆకస్మికంగా బరువు తగ్గడం వంటి సంకేతాలు కనిపిస్తాయి.
వైద్యులు వ్యాధిని ఎలా నిర్ధారిస్తారు?
కేవలం లక్షణాల ఆధారంగా ప్రోస్టేట్ వాపు లేదా క్యాన్సర్ అని నిర్ధారించడం సాధ్యం కాదు. దీనికోసం వైద్యులు కొన్ని ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తారు:
డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ (డీఆర్ఈ): వైద్యులు ప్రాథమికంగా ప్రోస్టేట్ గ్రంధి పరిమాణం, గట్టిదనాన్ని చేతి వేలి ద్వారా పరిశీలిస్తారు.
పీఎస్ఏ బ్లడ్ టెస్ట్: ప్రోస్టేట్ గ్రంధి ఉత్పత్తి చేసే ‘ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్’ ప్రోటీన్ స్థాయిలను రక్తం ద్వారా లెక్కిస్తారు. బీపీహెచ్, ఇన్ఫెక్షన్ లేదా క్యాన్సర్ ఉన్నప్పుడు పీఎస్ఏ స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి పీఎస్ఏ పెరిగినంత మాత్రాన క్యాన్సర్ ఉన్నట్లు కాదు.
మూత్ర, ఫ్లో పరీక్షలు: ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి, మూత్రం ఎంత వేగంగా బయటకు వస్తుందో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేస్తారు.
స్కాన్లు (అల్ట్రాసౌండ్ / ఎంఆర్ఐ): ప్రోస్టేట్ గ్రంధి నిర్మాణం, పరిమాణాన్ని స్పష్టంగా చూడటానికి స్కాన్ చేస్తారు.
బయాప్సీ : క్యాన్సర్ అనుమానం బలంగా ఉంటే మాత్రమే చిన్న కణజాల ముక్కను తీసి మైక్రోస్కోప్ కింద పరీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు.
ప్రోస్టేట్ వాపు, ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స విధానాలు..
ప్రోస్టేట వాపు సమస్య తీవ్రత తక్కువగా ఉంటే ప్రత్యేక చికిత్స అవసరం లేదు. కేఫిన్ (కాఫీ, టీ), ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడం, రాత్రివేళ ద్రవాహారం తక్కువగా తీసుకోవడం వంటి జీవనశైలి మార్పులతో ఉపశమనం పొందే వీలుంది. అవసరమైతే గ్రంధి పరిమాణాన్ని తగ్గించేందుకు, మూత్రనాళాన్ని సడలించేందుకు మందులు వాడతారు. తీవ్రమైన కేసుల్లో చిన్నపాటి శస్త్రచికిత్సలు చేస్తారు.
అదే ప్రోస్టేట్ క్యాన్సర్ విషయానికి వస్తే, క్యాన్సర్ కణాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో చూసి చికిత్సను ఖరారు చేస్తారు. నెమ్మదిగా పెరిగే క్యాన్సర్లకు క్రమబద్ధమైన పర్యవేక్షణ సరిపోతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉంటే సర్జరీ, రేడియేషన్ లేదా హార్మోన్ థెరపీని అందిస్తారు.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
వయస్సుతో పాటు వచ్చే మూత్ర సమస్యలు సాధారణమైనవే అయినా, కింది సంకేతాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి:
- రాత్రిపూట నిద్రకు భంగం కలిగించేలా పదే పదే మూత్రవిసర్జన రావడం.
- కాలక్రమేణా మూత్రధార బాగా బలహీనపడటం.
- మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపించడం.
- పొత్తికడుపు లేదా వెన్ను దిగువ భాగంలో తగ్గని నొప్పి.
- కుటుంబంలో ప్రోస్టేట్ క్యాన్సర్ హిస్టరీ ఉండటం.
50 ఏళ్లు దాటిన పురుషులు క్రమం తప్పకుండా పీఎస్ఏ పరీక్షల గురించి వైద్యులతో చర్చించాలి. ఒకవేళ మూత్రం అసలు రాకుండా ఆగిపోతే తక్షణమే అత్యవసర వైద్య విభాగాన్ని సంప్రదించాలి. సమయానికి పరీక్షలు చేయించుకోవడం వల్ల వ్యాధి ప్రారంభంలోనే గుర్తించి పూర్తిస్థాయిలో నయం చేసుకోవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


