...
...
Next Story

తిరుమల లడ్డూ కల్తీ కేసు.. ఏపీ వెలుపల విచారణ బదిలీకి సుప్రీంకోర్టు నో

tirumala laddu adulteration case : తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసును ఆంధ్రప్రదేశ్ వెలుపలకు బదిలీ చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

Published on: Nov 5, 2026, 13:08:21 IST
Advertisement

సంచలనం సృష్టించిన తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుపలికి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ ఏపీలోనే కొనసాగుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. భారత్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఒకరైన మహారాష్ట్రకు చెందిన డెయిరీ వ్యాపారి మచింద్ర శాంతారామ్ లాంకే దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దేవ్ తన వాదనలను వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వాతావరణం తీవ్ర రాజకీయ వేడితో కూడుకుని ఉందామని, అక్కడ నిష్పాక్షిక విచారణ జరగడం కష్టమని దేవ్ వాదించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులతో సహా పలువురు కీలక రాజకీయ నాయకులు ఈ కేసుపై బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలు కేసు విచారణను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశం ఏపీలో అత్యంత సున్నితమైనది, సెంటిమెంట్‌తో కూడుకున్నది అయినందున విచారణను ఇతర పొరుగు రాష్ట్రాలకు బదిలీ చేయాలని అభ్యర్థించారు.

నిందితుల తరఫు న్యాయవాది వాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ(CBI) నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని అధికార వర్గాలు లేదా రాజకీయ నాయకులు చేసే ఎలాంటి వ్యాఖ్యలు, ప్రకటనల వల్ల సీబీఐ విచారణ ప్రభావితం కాదు. సీబీఐకి అవేవీ పట్టవు.' అని జస్టిస్ బాగ్చీ స్పష్టం చేశారు.

కేంద్ర దర్యాప్తు సంస్థ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన సమగ్ర దర్యాప్తులో తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. టీటీడీకి సుమారు 68 లక్షల కిలోల నకిలీ, సింథటిక్ నెయ్యిని సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. ఈ మొత్తం కుంభకోణం విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుందని దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి.

ఈ కేసును ఏపీ పరిధి దాటించాలన్న నిందితుల చివరి ప్రయత్నానికి సుప్రీంకోర్టు నో చెప్పింది. శాంతారామ్ పిటిషన్‌ను కొట్టివేసింది. తిరుమల లడ్డూ కల్తీ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయంతో తదుపరి పరిణామలపై ఉత్కంఠ నెలకొంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks