AP Telangana Weather Report : నైరుతి రుతుపవనాల కదలికలకు తోడు వాతావరణంలో ఏర్పడిన తాజా మార్పులతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో పాటు స్థిరంగా ఉన్న ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల మూడు నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
తెలంగాణలో వర్షాలు - ఐఎండీ అంచనాలు :

తెలంగాణ వ్యాప్తంగా జూలై 21 నుండి జూలై 24 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంతి మోస్తరు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- జూలై 21వ తేదీన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
- జూలై 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉంది. ఈనెల 25వ తేదీ వరకు కూడా పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.
ఏపీలోనూ వర్షాలు - అంచనాలు ఇలా :
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం పరిధిలో రాగల మూడు రోజుల పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు కనిపిస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
- ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం : ఇవాళ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురుస్తాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి కూడా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తూనే ఉంటాయి.
- దక్షిణ కోస్తా : ఇవాళ, రేపు కూడా ఒకటి లేదా రెండు చోట్ల మోస్తరు వర్షాలు పడతాయి.
- రాయలసీమ : ఇవాళ, రేపు కూడా వర్షాలు పడనున్నాయి. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.