ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదు.. ప్రైవేట్ వాహనాల్లో జాగ్రత్త : మంత్రి రాంప్రసాద్ రెడ్డి

సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక సూచనలు చేశారు. మరోవైపు సంక్రాంతికి అదనపు బస్సు ఛార్జీలు లేవని ప్రకటించారు.

Published on: Jan 13, 2026, 13:15:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కార్యాలయం నుండి ప్రకటన విడుదల చేశారు. పండుగ రద్దీ దృష్ట్యా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని, సంక్రాంతి సందర్భంగా ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని స్పష్టం చేశారు.

మంత్రి రాంప్రసాద్ రెడ్డి
మంత్రి రాంప్రసాద్ రెడ్డి

ఈ ఏడాది ఆర్టీసీ ఛార్జీల్లో కూడా ఎలాంటి పెంపు లేదని మంత్రి మండిపల్లి తెలిపారు. సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించే వారు జాగ్రత్తగా నిబంధనలు పాటిస్తూ క్షేమంగా సొంత ఊళ్లకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇది పండుగ కానుకగా అని అన్నారు.

అదే విధంగా ప్రైవేట్ బస్సులు అక్రమంగా ఛార్జీలు పెంచితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తే సంబంధిత బస్సులను సీజ్ చేయడం జరుగుతుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పండుగను ప్రజలు ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని తెలిపారు.

సంక్రాంతికి ఊర్లకు వెళ్తుండటంతో రహదారులపై ట్రాఫిక్ భారీగా ఉంది. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోని ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్లలో తెల్లవారుజాము నుంచే రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు సొంత గ్రామాలకు వెళ్లే బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉన్నారు.

కృష్ణ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర జిల్లాలను కలిపే మార్గాల్లో ప్రయాణీకుల రద్దీ తీవ్రంగా ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతికి మొత్తం 8,432 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. 6,000 బస్సు సర్వీసులు ఆంధ్రప్రదేశ్‌లోని డిమాండ్‌ను తీర్చడానికి పరిమితం చేశారు. అయితే 2,432 బస్సులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానించేందుకు ఏర్పాటు అయ్యాయి.

ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రత్యేకంగా నడుస్తున్నప్పటికీ.. రద్దీ రోజులలో డిమాండ్ ఎక్కువగానే ఉంది. దీని వలన చాలా మంది ప్రయాణికులు ప్రైవేట్ రవాణాను ఉపయోగించుకోవాల్సి వచ్చింది. విజయవాడ బస్ స్టేషన్ నుండి అధిక సంఖ్యలో బస్సులు నడిపిస్తున్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More