...
...
Next Story

Tirumala Temple : శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. పట్టువస్త్రాల సమర్పణ.. రికార్డు

Tirumala Temple : తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 15వ సారి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

Published on: Sep 15, 2026, 22:02:18 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అయితే 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించి.. అరుదైన రికార్డు నమోదు చేశారు.

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు

శ్రీ బేడి ఆంజనేయస్వామి ఆలయం వద్ద అర్చకులు ముఖ్యమంత్రికి సంప్రదాయబద్ధంగా ‘పరివట్టం’ కట్టారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలను వెండి పళ్ళెంలో తలపై మోస్తూ మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లి గర్భాలయంలో అర్చకులకు అందజేశారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సీఎం దంపతులకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడు, ఈవో ఎం. రవిచంద్ర ముఖ్యమంత్రికి తీర్థప్రసాదాలు అందజేశారు. టీటీడీ రూపొందించిన 2027 నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను సీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.

స్వామివారికి 15వ సారి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం అదృష్టమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల క్షేమం, సమృద్ధిగా వర్షాలు కురవాలని, అలాగే భారతదేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.

భక్తుల కోసం అనేక సంస్కరణలు చేపడుతూ తిరుమలను ఆలయ సంస్కృతికి రోల్ మోడల్‌గా నిలిపినందుకు టీటీడీ బోర్డును, అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. రాత్రి జరిగిన శ్రీవారి పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో మంగళవారం వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య, మంగళవాద్యాలు మోగుతుండగా, అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

సంప్రదాయం ప్రకారం శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడు, ప్రధాన సేవకుడైన గరుత్మంతుడు సమస్త లోకాలను సందర్శించి, బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఆశీర్వదించవలసిందిగా దేవతలను ఆహ్వానిస్తాడు. ధ్వజారోహణ క్రతువులో భాగంగా, వేద పండితులు గరుడ గద్యం, గరుడ చూర్ణిక, ఇతర సంబంధిత శ్లోకాలను పఠించారు. ఆ తర్వాత, ఆలయ ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని శాస్త్రోక్తంగా ఎగురవేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks