...
...
Next Story

హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్ప

తిరుమల బ్రహ్మోత్సవాల్లో హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీమలయప్పస్వామి అభయం ఇచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవిందా... గోవిందా... అంటూ స్వామివారిని దర్శించుకున్నారు.

Published on: Sep 20, 2026, 15:34:47 IST
Advertisement

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు గంభీరంగా నడుస్తుండగా, భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ హనుమంత వాహనసేవ భక్తి పారవశ్యంతో వైభవంగా సాగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవిందా... గోవిందా... అంటూ స్వామివారిని దర్శించుకున్నారు.

హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప
హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శేషాచలాధీశుడు శ్రీరామావతారంలో తన పరమభక్తుడైన హనుమంతునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులలో అగ్రగణ్యుడైన హనుమంతుడు భగవంతునిపై అచంచలమైన భక్తి, సేవాభావం, శరణాగతికి ప్రతిరూపంగా నిలుస్తాడు.

గురుశిష్యులైన శ్రీరాముడు, హనుమంతుల దివ్యసంబంధం భక్తి, జ్ఞానం, సేవాతత్వాల సమన్వయాన్ని చాటిచెబుతుంది. హనుమంత వాహనంపై కోదండరాముని దర్శించుకోవడం ద్వారా భక్తులకు భగవద్భక్తి, ధర్మనిష్ఠ, శరణాగతి భావాలు మరింతగా పెంపొందుతాయని ఆధ్యాత్మిక విశ్వాసం.

ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయ సిబ్బందికి వస్త్ర బహుమానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భక్తిశ్రద్ధలతో సేవలందిస్తున్న శ్రీవారి ఆలయ అర్చకులు, వేదపారాయణదారులు, ఇతర సిబ్బంది, పోటు సిబ్బంది, వాహన బేరర్లు, మేళం సిబ్బందికి ఆదివారం వస్త్ర బహుమానం అందించారు. నెల్లూరు లోకసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కలిసి ఈ వస్త్ర బహుమానాన్ని అందజేశారు. తిరుమల వైభవోత్సవ మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి చేతుల మీదుగా సిబ్బందికి వస్త్రాలను అందించారు.

తిరుమలలో శ్రీవారి గరుడ వాహన సేవలో పలు విశేషాలు భక్తులను ఆకట్టుకున్నాయి. గరుడ వాహన సేవ సందర్భంగా తొలిసారిగా సింగపూర్‌ నుంచి వచ్చిన కళాకారులు సీతారామ కళ్యాణంలోని పౌరాణిక పాత్రలను ప్రదర్శించి భక్తులను అలరించారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

సామాన్య భక్తులు గరుడ వాహన సేవను సులభంగా దర్శించుకునేందుకు తిరుమలనంబి నుంచి ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా వాహన దర్శనానికి అనుమతించారు. గరుడసేవ సందర్భంగా భక్తులకు మొత్తం 15 రకాల మెనూ అందించారు. ఇందులో 8 రకాల ఆహార పదార్థాలు, 7 రకాల పానీయాలు ఉన్నాయి.

భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అన్నప్రసాదం విభాగం ముందస్తు ప్రణాళికతో అన్నప్రసాదం, పానీయాలు, అల్పాహారం కలిపి సుమారు 24 లక్షల సర్వింగ్స్‌ అందించేలా ఏర్పాట్లు చేసింది. గరుడసేవ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టి, భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పానీయాలు తదితర సౌకర్యాలను అందించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks