...
...
Next Story

అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో మలయప్ప.. గోవిందనామస్మరణతో మార్మోగిన తిరుమాడ వీధులు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారి దివ్యదర్శనం ఇచ్చారు.

Published on: Sep 22, 2026, 22:20:57 IST
Advertisement

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రాత్రి అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. అశ్వ వాహనానికి ముందు గజరాజులు నడుస్తుండగా, భక్త బృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ అత్యంత వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ గోవిందనామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.

ఇంద్రియ నియంత్రణకు అశ్వ వాహనం సందేశం

అశ్వవాహనంపై స్వామివారు
అశ్వవాహనంపై స్వామివారు

ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలతో పోలుస్తాయి. అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడిగా ఈ వాహనసేవ ద్వారా తెలియజేస్తున్నారు. కృష్ణయజుర్వేదం పరమాత్మను అశ్వ స్వరూపంగా తెలియజేస్తుంది.

కల్కి స్వరూపంలో అశ్వ వాహనంపై విహరించిన శ్రీమలయప్ప స్వామివారు కలియుగ దోషాలకు దూరంగా ఉండి, నామసంకీర్తనను ఆశ్రయించి భగవంతుని అనుగ్రహం పొందాలని భక్తులకు ప్రబోధిస్తున్నట్లు ఈ వాహనసేవ అంతరార్థాన్ని తెలియజేస్తోంది. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు ముందుగా నిర్వహించే కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం మంగళవారం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రతను పరిరక్షిస్తూ, వైదిక సంప్రదాయాలకు అనుగుణంగా ఈ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సెప్టెంబరు 24 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా, పవిత్రంగా సిద్ధం చేశారు.

ఈ సందర్భంగా ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర సమస్త వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలను కలిపి సిద్ధం చేసిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి సందర్భాల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయితే యాత్రికులు లేదా సిబ్బంది ద్వారా తెలిసో తెలియకో ఇటువంటి దోషాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కారణాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం కలగకుండా, శాస్త్రోక్త పరిహారంగా ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో భాగంగా: సెప్టెంబరు 24: పవిత్ర ప్రతిష్ఠ, సెప్టెంబరు 25: పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 26: పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

రూ.750 చెల్లించి గృహస్తులు ఒకరికి మూడు రోజులపాటు పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు. పవిత్రోత్సవాల నిర్వహణలో భాగంగా భక్తుల సౌకర్యార్థం పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

సెప్టెంబరు 23 నుండి 26వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజలసేవ, సెప్టెంబరు 24 నుండి 26వ తేదీ వరకు వేదాశీర్వచనం, సెప్టెంబర్ 25, 26వ తేదీల్లో బ్రేక్ దర్శనము, కుంకుమార్చన, లక్ష్మీపూజ సేవలు రద్దు. అదేవిధంగా సెప్టెంబరు 24న తిరుప్పావడ సేవ, సెప్టెంబరు 25న అభిషేకానంతర దర్శనం, సెప్టెంబరు 26న సామవేద పుష్పాంజలి సేవలను టీటీడీ రద్దు చేసింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks