...
...
Next Story

తిరుమల : నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత వేడుకగా ఛత్రస్థాపనోత్సవం

తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహించారు. ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాలు చెబుతున్నాయి.

Updated on: Jul 26, 2026, 17:19:21 IST
Advertisement

తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండో గంట తర్వాత పూజ సామ‌గ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆల‌య మాడ వీధుల గుండా మేదరమిట్టకు చేరుకున్నారు.

శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం
శ్రీవారి పాదాల చెంత ఛత్రస్థాపనోత్సవం

అక్కడి నుండి నారాయ‌ణ‌గిరికి విచ్చేశారు. ముందుగా శ్రీ‌వారి పాదాల‌కు తిరుమంజ‌నం చేప‌ట్టారు. అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. ఆ త‌రువాత‌ భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామివారు మొదటగా కాలు మోపినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది.

సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అధికారులు, అర్చకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

దివ్య పుష్పయాగం

తిరుపతి అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 30వ తేదీన అత్యంత వైభవంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల అనంతరం ఆలయ పవిత్రత, లోకక్షేమం, భక్తుల సర్వమంగళాల కోసం నిర్వహించే ఈ దివ్యోత్సవం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది. ఈ సందర్భంగా జూలై 29వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు మేధిని పూజ, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువ తదితర సుగంధ పుష్పాలతో స్వామివారికి వైభవంగా పుష్పయాగం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు స్వామివారి వీధి ఉత్సవం భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తనుంది.

ఇటీవల జరిగిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం నిత్యకైంకర్యాలు, ఉత్సవాల్లో తెలిసీ తెలియక జరిగిన లోపాలకు ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ మహోత్సవం ద్వారా సమస్త దోషాలు తొలగి, లోకానికి శాంతి, సుభిక్షం చేకూరడంతో పాటు భక్తుల సకల మనోరథాలు నెరవేరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks