తిరుమల : జపాలి తీర్థం కొళాయిలలో తెల్లటి నీరు - టీటీడీ ఏం చెప్పిందంటే..?
తిరుమల జపాలి ఆంజనేయస్వామి ఆలయం వద్ద నీరు తెల్లగా రావడంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై టీటీడీ స్పందించింది. ల్యాబ్ పరీక్షల్లో ఆ నీరు పరిపూర్ణంగా స్వచ్ఛమైనదని నిర్ధారణ అయినట్లు తెలిపింది.
తిరుమల క్షేత్రంలోని ప్రముఖ పుణ్యతీర్థం జపాలి శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న నీటి కొళాయిలలో తెల్లటి నీరు వస్తోందంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జోరందుకున్నాయి. ఈ నీటి రంగును చూసి భక్తుల్లో పలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దీనిపై పూర్తిస్థాయిలో స్పందించి అధికారిక వివరణ ఇచ్చింది.

టీటీడీ వివరణ….
సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోలను నిశితంగా పరిశీలిస్తే, కొళాయి నుంచి నీరు విడుదలైన కొన్ని సెకన్ల వ్యవధిలోనే అది మళ్లీ తన సహజమైన పారదర్శక రూపాన్ని సంతరించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. పైప్‌లైన్లలో అధిక నీటి ఒత్తిడి (వాటర్ ప్రెజర్) ఉండటం వల్ల నీటిలో సూక్ష్మమైన గాలి బుడగలు (ఎయిర్ బబుల్స్) ఏర్పడతాయని నీటిపారుదల, సాంకేతిక నిపుణులు వెల్లడించారు. ఈ గాలి బుడగల కారణంగానే నీరు తాత్కాలికంగా తెల్లటి నురుగులా కనిపిస్తుందే తప్ప…. అందులో ఎలాంటి రసాయనిక దోషం లేదని వివరించారు.
భక్తుల నమ్మకాన్ని, ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తక్షణమే రంగంలోకి దిగింది. జపాలి వద్ద లభించే ఈ నీటి నమూనాలను సేకరించి తిరుమలలోని 'టీటీడీ ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్'కు పంపించింది. అక్కడ అధునాతన పద్ధతుల్లో శాస్త్రీయంగా పరీక్షలు నిర్వహించారు. ల్యాబ్ పరీక్షల ఫలితాల్లో ఆ నీరు వంద శాతం స్వచ్ఛమైనదని, తాగడానికి మరియు వినియోగానికి పూర్తిగా సురక్షితమని నిపుణులు ధ్రువీకరించారు.
పరీక్షించిన నీటిలో ఎలాంటి దుర్వాసన లేదు. నీటి అడుగున ఎలాంటి వ్యర్థాలు లేదా అవశేషాలు (సెడిమెంట్) చేరడం లేదని, ప్రమాదకరమైన మలినాలు ఏమీ లేవని ఫుడ్ అండ్ వాటర్ అనాలసిస్ ల్యాబ్ నిపుణులు స్పష్టం చేశారు. నీటి ప్రవాహ వేగం వల్ల తాత్కాలికంగా ఏర్పడే గాలి బుడగలే ఈ మార్పునకు ఏకైక కారణమని తేల్చిచెప్పారు.
కాబట్టి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు…. జపాలి తీర్థాన్ని సందర్శించే స్వామివారి సేవకులు ఎలాంటి అపోహలకు, ఆందోళనలకు లోనుకావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. నిజానిజాలు తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అసత్య సమాచారాన్ని, వదంతులను అస్సలు నమ్మవద్దని కోరింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

