...
...
Next Story

తిరుమలలో నకిలీ ఆధార్‌లతో రూమ్‌ల దందా - దళారీ ముఠా గుట్టురట్టు! వెలుగులోకి కీలక విషయాలు

తిరుమల సీఆర్వో వద్ద నకిలీ ఆధార్ కార్డులతో గదులు పొంది భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న కేరళ వాసిని టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Published on: Aug 17, 2026, 13:28:17 IST
Advertisement

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం తిరుమలకు వచ్చే అమాయక భక్తులను మోసగిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న దళారీ ముఠా కుట్రను టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అధికారులు చాకచక్యంగా భగ్నం చేశారు. నకిలీ గుర్తింపు పత్రాలను సృష్టించి వేరొకరి పేర్లతో సీఆర్వో (CRO) కార్యాలయం వద్ద వసతి గదులు పొందుతూ, వాటిని భక్తులకు అధిక ధరలకు అమ్ముకుంటున్న ఘరానా దందాను అధికారులు గుట్టురట్టు చేశారు.

తిరుమలలో నకిలీ ఆధార్‌లతో రూమ్‌ల దందా
తిరుమలలో నకిలీ ఆధార్‌లతో రూమ్‌ల దందా

ఆగస్టు 16న జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే….. అప్పటికే ఒక గదిని పొందిన ఒక వ్యక్తి, మరో నకిలీ గుర్తింపు కార్డుతో మళ్లీ గది కోసం క్యూ లైన్‌లో నిలబడ్డాడు. అతడి అనుమానాస్పద కదలికలను గమనించిన సీఆర్వో కార్యాలయ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు.

విచారణలో కీలక విషయాలు….

అదుపులోకి తీసుకున్న వ్యక్తిని కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన ఆషిక్ అలీ పి.ఎం. (32)గా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అతడి వద్ద నుంచి రెండు నకిలీ ఆధార్ కార్డులు, ఒక గది రిజిస్ట్రేషన్ స్లిప్, రూ.800 నగదుతో పాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

విజిలెన్స్ అధికారుల విచారణలో ఆషిక్ అలీ పలు కీలక విషయాలను వెల్లడించాడు. "రంజిత్ అనే దళారి నాకు ఒక్కో గదికి రూ.1,000 చొప్పున కమిషన్ ఇస్తానని చెప్పి ఈ పనిలో పెట్టాడు. నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి క్యూ లైన్లలో నిలబడి గదులు పొందడం, వాటిని రంజిత్‌కు అప్పగించడం నా బాధ్యత. ఆ తర్వాత రంజిత్ ఆ గదులను తిరుమలకు వచ్చే భక్తులకు భారీ ధరలకు విక్రయిస్తాడు," అని ఆషిక్ నిజాలు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ దళారీ ముఠాలోని ఇతర సభ్యుల కోసం శోధిస్తున్నారు.

తిరుమలలో వసతి గదులు కేవలం శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యార్థం మాత్రమేనని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ దళారుల బారిన పడి గదులను కొనుగోలు చేయవద్దని హెచ్చరించింది.

• ఆధార్ కార్డులు, ఫొటోలు, ఫోన్ నంబర్లు వంటి వ్యక్తిగత వివరాలను అపరిచిత వ్యక్తులకు లేదా దళారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు.

• వసతి గదులను కేవలం నేరుగా తిరుమలలోని సీఆర్వో (CRO) కౌంటర్లు, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా టీటీడీ అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే పొందాలి.

• ఎవరైనా దళారులు డబ్బులు తీసుకుని గది ఇప్పిస్తామని సంప్రదించినా, లేదా వారి కదలికలు అనుమానాస్పదంగా అనిపించినా భక్తులు వెంటనే ఫిర్యాదు చేయాలి.

• ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు : టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ కంట్రోల్ రూమ్ - 9866898630, టీటీడీ ఉచిత కాల్ సెంటర్ - 155257

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసగించే దళారులపై, వారికి సహకరించే వ్యక్తులపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks