...
...
Next Story

89.40 శాతం ప‌చ్చద‌నంతో క‌ళ‌క‌ళ‌లాడుతున్న తిరు గిరులు

89.40 శాతం ప‌చ్చద‌నంతో తిరు గిరులు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. అరణ్య సంపద పరిరక్షణలో టీటీడీ అట‌వీ శాఖ దేశంలోనే అగ్రగామి నిలుస్తోంది. స్థానిక వృక్ష సంపద పునరుద్ధరణకు విస్తృతంగా చర్యలు తీసుకుంటోంది.

Published on: May 17, 2026, 20:25:12 IST
Advertisement

తిరుమల తిరుపతి దేవస్థానముల అటవీ శాఖ 1980 సంవత్సరం నుండి శేషాచల అరణ్య సంపదను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తోంది. తూర్పు కనుమల్లో విస్తరించిన శేషాచల పర్వత శ్రేణుల్లోని అరణ్య ప్రాంతాలను సంరక్షిస్తూ జీవ వైవిధ్య పరిరక్షణలో కీలక పాత్రను పోషిస్తోంది.

తిరు గిరులు
తిరు గిరులు

టీటీడీ అటవీ విభాగ పరిధిలో మొత్తం 2719 హెక్టార్ల విస్తీర్ణంలో అరణ్య ప్రాంతం ఉండగా, తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ నివేదిక‌ (ISFR) ప్రకారం 89.40 శాతం మేర అటవీ ప్రాంతం నమోదు కావ‌డం విశేషం. ఇది దేశంలోనే అత్యుత్తమైన స్థానంలో టీటీడీని నిలిపింది. సుమారు 2431 హెక్టార్లలో అట‌వీ ప్రాంతాలు ఉన్నాయి. ఇవి కార్బన్ నిల్వలు, వాతావరణ నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణకు ముఖ్యంగా దోహదపడుతున్నాయి.

వివిధ అటవీ సిబ్బంది విధులు

టీటీడీ అట‌వీ విభాగాన్ని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తిరుమలలో రెండు, తిరుపతిలో రెండు చొప్పున మొత్తం నాలుగు ఫారెస్ట్ రేంజ్‌లు ఉన్నాయి. ప్రతి రేంజ్‌ను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. ఫీల్డ్ స్థాయిలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, సిబ్బంది సమన్వయంతో అటవీ పరిరక్షణ చేపడుతున్నారు.

అటవీ సంరక్షణ చర్యలు

అటవీ సంపద సంరక్షణలో భాగంగా 24 గంటల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పహారా నిర్వహిస్తూ చెట్ల నరికివేత, వేట చర్యలను అరికడుతున్నాయి. అటవీ అగ్నిప్రమాదాల నివారణకు ప్రత్యేక ఫైర్ లైన్లు నిర్వహించ‌డంతో పాటు శిక్షణ పొందిన బృందాలు వేగంగా స్పందించి 100 శాతం వరకు అగ్నిమాపక చర్యలు చేపడుతున్నాయి. ప్రతి సంవత్సరం 26.5 లక్షల చదరపు మీటర్ల మేర ఫైర్ లైన్లు నిర్వహిస్తున్నారు.

576 హెక్టార్లలో స్వదేశీ మొక్కల పెంపకం

టీటీడీ పరిధిలోని నాలుగు ఫారెస్ట్ రేంజ్‌లలో ప్రత్యేక నర్సరీలను నిర్వహిస్తూ స్థానిక జాతుల మొక్కలు, అలంకార మొక్కలు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు. అటవీ పునరుద్ధరణ కార్యక్రమాలకు అవసరమైన నాణ్యమైన మొక్కలను ఈ నర్సరీల ద్వారా సరఫరా చేస్తున్నారు.

వన్యప్రాణుల రక్షణకు చర్యలు

శేషాచల అరణ్యాల్లో ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు, పాములు వంటి అనేక వన్యప్రాణులు నివసిస్తున్నాయి. మానవ – వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు, గాయపడిన జంతువులను రక్షించేందుకు టీటీడీ అటవీ విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంతాల్లో జంతువుల దాహార్తి తీర్చేందుకు ప్రత్యేక నీటి గుంతలు ఏర్పాటు చేసి వాటిలో నీటిని నింపుతోంది. దీంతో నీటి కోసం అడవి జంతువులు మానవ ప్రాంతంల్లోకి వచ్చే అవకాశాలు పూర్తిగా తగ్గడం జరిగింది. అలాగే దర్శన క్యూ లైన్ ప్రాంగణాల్లో మూడు స్నేక్ రెస్క్యూ బృందాలను నిరంతరం అప్రమత్తంగా ఉంచుతోంది.

అదేవిధంగా భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరమైన చెట్లను గుర్తించి తొలగించడం, గాలివానల కారణంగా పడిపోయిన చెట్లను తొలగించడం, రహదారుల పక్కన చెట్ల కొమ్మలను క్రమం తప్పకుండా తొలగించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆలయ పూజ కైంకర్యాలలో అటవీ శాఖ పాత్ర

అలాగే తిరుమల, టీటీడీ ఆలయ అవసరాల కోసం శ్రీ‌గంధం చెక్కలు, వంట చెరుకు, దర్భ గడ్డి, ఇతర పూజా సామగ్రిని టీటీడీ ఫారెస్ట్ విభాగం సమకూరుస్తోంది. తిరుమల, తిరుపతిలోని రహదారి డివైడర్లు, ఉద్యానవనాలు, పచ్చదన అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. మొత్తం 24 కిలోమీటర్ల మేర రహదారి డివైడర్లు, 25 ఉద్యానవనాలను సంరక్షిస్తోంది.

ఔషధ వనాల పెంపకం

అరుదైన, ఔషధ గుణాలు కలిగిన వృక్ష జాతుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించిన టీటీడీ, ఆయుర్వేద ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలను కూడా సరఫరా చేస్తోంది. ప్రస్తుతం పవిత్ర వనం, దివ్య ఔషధ వనం, పాలమనేరు టింబర్ ప్లాంటేషన్, వన్యప్రాణి ఘర్షణల నివారణకు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం, కొండల పచ్చదనం పెంపు వంటి పలు కీలక ప్రాజెక్టులను టీటీడీ ఫారెస్ట్ విభాగం అమలు చేస్తోంది. పవిత్ర అరణ్య సంపదను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ప్రకృతి వారసత్వాన్ని అందించడం టీటీడీ అట‌వీ విభాగం ప్రధాన లక్ష్యంగా ప‌ని చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe