చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీకృష్ణుని నర్తన రూపం భక్తులను పరవశింపజేసింది.

Published on: Oct 18, 2026, 21:28:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహించారు. వేణుగాన లీలలను స్ఫురింపజేసే శ్రీకృష్ణుని నర్తన రూపం భక్తులను పరవశింపజేసింది.

చంద్రప్రభ వాహనంపై స్వామివారు
చంద్రప్రభ వాహనంపై స్వామివారు

చంద్రుని చల్లని వెన్నెల ప్రకృతికి ఆహ్లాదాన్ని, మనసుకు ప్రశాంతతను అందించినట్లే, చంద్రప్రభ వాహనంపై విహరించిన శ్రీవారి దివ్యమంగళ రూపం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. పరమశివుని శిరోభూషణంగా చంద్రుడు విరాజిల్లుతుండగా, శ్రీమహావిష్ణువు వాహనంగా చంద్రప్రభ వెలుగొందడం హరిహర తత్త్వ సమన్వయాన్ని స్ఫురింపజేసే విశిష్ట ఆధ్యాత్మిక విశేషం.

నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీవారి దర్శనం భగవంతుని దివ్యలీలలను స్మరింపజేసింది. చంద్రుని శీతల కాంతులు, శ్రీకృష్ణుని లీలామాధుర్యం, శ్రీవారి దివ్య తేజస్సు మేళవించిన ఈ వాహనసేవ తిరుమలలో భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ఇనుమడింపజేసింది. ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, సీవీఎస్వో మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.

పుష్పాలంక‌ర‌ణ‌ల‌కు విశేష ప్రశంస‌లు

శ్రీ‌వారి సాల‌క‌ట్ల, న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల‌ను పుర‌స్కరించుకుని తిరుమ‌ల‌లో చేప‌ట్టిన పుష్పాలంక‌ర‌ణ‌ల‌కు భ‌క్తుల నుండి విశేష ప్రశంస‌లు వ‌చ్చాయ‌ని టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ‌నివాసులు తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని రామ్ భ‌గీచా-2లోని మీడియా సెంట‌ర్ లో ఆదివారం నిర్వహించిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల‌కు తిరుమ‌ల‌లో పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టేందుకు దాదాపు 30 మంది దాత‌లు ముందుకువ‌చ్చార‌ని, వారి స‌హ‌కారం, ఉన్నతాధికారుల ప్రోత్సాహం, ఉద్యానవన సిబ్బంది కృషితో తిరుమ‌ల‌లో అత్యంత శోభాయ‌మానంగా పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టామ‌ని చెప్పారు. దాదాపు 60 ట‌న్నుల పుష్పాలు, 5 ల‌క్షల క‌ట్ ఫ్లవ‌ర్స్, 80 వేల సీజ‌న‌ల్ ఫ్లవ‌ర్స్ వినియోగించిన‌ట్లు తెలిపారు. శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద బ్రహ్మోత్సవాల‌ తొలిరోజు, గ‌రుడ‌సేవ రోజు, ఏడో రోజు పుష్పాలంక‌ర‌ణ‌లు మార్చడం జ‌రిగిందని తెలిపారు.

జీఎన్సీ వ‌ద్ద ఏర్పాటు చేసిన పుష్పాలంక‌ణ భ‌క్తుల‌ను విశేషంగా ఆకట్టుకుంద‌ని చెప్పారు. బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా క‌ల్యాణ వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన‌ ఫ‌ల, పుష్ప ప్రద‌ర్శన‌లో చిన్న పిల్లల‌కు పురాణాల‌పై ఆస‌క్తి క‌లిగేలా 24 ర‌కాల కాన్సెప్ట్‌ల‌తో పుష్పాలంక‌ర‌ణ‌లు చేప‌ట్టిన‌ట్లు తెలియ‌జేశారు.

భవిష్యత్తులో ఏఐ స‌హ‌కారంతో తిరుమ‌ల‌లో ఉద్యాన‌వ‌నాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక‌లు రూపొందిస్తున్నట్లు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ‌నివాసులు తెలిపారు. తిరుమ‌ల‌లో 34 ఉద్యాన‌వ‌నాలు ఉన్నాయ‌నీ, 20 ఉద్యాన‌వ‌నాల‌ను దాత‌లు నిర్వహిస్తుండ‌గా, 14 ఉద్యాన‌వానాల‌ను టీటీడీ నిర్వహిస్తోంద‌ని చెప్పారు. ఈ ఉద్యాన‌వ‌నాల‌ను నిర్వహ‌ణలో ఏఐ భాగ‌స్వామ్యంతో మ‌రింత అందంగా తీర్చిదిద్దనున్నట్లు తెలియ‌జేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More