...
...
Next Story

తిరుమల బ్రహ్మోత్సవాలు 2026 : శ్రీవారి ఆలయానికి దర్భ చాప, తాడు - ఈ నెల 15న ధ్వజారోహణం

Tirumala Srivari Brahmotsavam 2026 : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ధ్వజారోహణ కోసం పవిత్రమైన దర్భ చాప, తాడును టీటీడీ అధికారులు ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. సెప్టెంబర్ 15న మీనలగ్నంలో ఇక్కడ ధ్వజారోహణం జరగనుంది.

Published on: Sep 13, 2026, 06:50:42 IST
Advertisement

Tirumala Srivari Brahmotsavam 2026 : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ధ్వజారోహణ ఘట్టంలో ఉపయోగించే పవిత్రమైన దర్భ చాప, తాడును టీటీడీ అటవీ విభాగం కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయానికి శనివారం ఊరేగింపుగా తీసుకొచ్చారు.

ఈనెల 15న ధ్వజారోహణం…

శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు
శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు

ఈ పవిత్రమైన దర్భ చాప, తాడును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఉన్న శేషవాహనంపై భక్తిశ్రద్ధలతో ఉంచారు. ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6.21 గంటల నుండి 6.35 గంటల వరకు మీనలగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ శుభ ముహూర్తంలోనే ఈ దర్భ చాపను, తాడును వినియోగిస్తారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకాన్ని ఎగురవేసి ముక్కోటి దేవతలను ఉత్సవాలకు ఆహ్వానించడం ఆనవాయితీ. రుత్వికులు వేద మంత్రోచ్ఛారణల నడుమ దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. అలాగే దర్భతో ప్రత్యేకంగా పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు.

దీని తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ దాదాపు 10 రోజుల ముందు నుంచే కసరత్తు ప్రారంభిస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉన్నప్పటికీ, తిరుమలలో కేవలం విష్ణు దర్భను మాత్రమే ఉపయోగిస్తారు.

ఈ పవిత్ర కార్యక్రమం కోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామం నుంచి టీటీడీ అటవీ సిబ్బంది ప్రత్యేకంగా విష్ణు దర్భను సేకరించారు. ఆ తర్వాత దీన్ని తిరుమలకు తీసుకువచ్చి, లేత ఎండలో వారం రోజుల పాటు ఎండబెట్టి, అత్యంత పరిశుభ్రంగా మార్చారు. అటవీశాఖ సిబ్బంది ఎంతో శ్రమించి 22 అడుగుల పొడవు, ఏడున్నర అడుగుల వెడల్పుతో 200 కిలోల బరువుండే దర్భ చాపను, అలాగే 250 మీటర్ల పొడవుతో 100 కిలోల బరువున్న తాడును సిద్ధం చేశారు.

శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తే…. దర్భలో సిలికా పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వాతావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు సూక్ష్మక్రిములను సంహరించే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సనాతన వేదోక్త కర్మల్లో దర్భను ఉపయోగించడాన్ని ఒక దైవిక వరంగా భావిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks